Birthday Party Disaster: ఊహించని విషాదం.. మొదటి పుట్టిన రోజునాడే తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:36 PM
ఉత్కర్ష మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. పెద్దఎత్తున జనం వచ్చారు. సరిగ్గా 12 గంటల సమయంలో పాప కేక్ కట్ చేసింది.
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో 17 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. మొదటి పుట్టిన రోజు వేడుక జరుగుతుండగానే ఓ చిన్నారి కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. చిన్నారి కుటుంబం మొత్తం శిథిలాల కింద సజీవ సమాధి అయింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్‌ఘర్ జిల్లా విరార్‌కు చెందిన ఆరోహీ జోయల్, ఓమ్‌కార్ జోయల్‌లు రామ్‌భాయ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.
ఆగస్టు 27వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ దంపతుల కూతురు ఉత్కర్ష మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. పెద్దఎత్తున జనం వచ్చారు. సరిగ్గా 12 గంటల సమయంలో పాప కేక్ కట్ చేసింది. తర్వాత అందరూ ఫొటోలు దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. 13 ఏళ్ల క్రితం కట్టిన ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద పడి చిన్నారి కుటుంబంతోపాటు మొత్తం 17 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద జోయల్ కుటుంబంలోని ఉత్కర్ష, ఆరోహీ మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకు లభ్యం అయ్యాయి. ఓమ్‌కార్ మృతదేహం భారీ శిథిలాల కిందే ఉండిపోయింది. దాదాపు 30 గంటల నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటనలో గాయపడ్డ 9 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిల్డింగ్ డెవలపర్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..