Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనతో విజయ్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:16 PM
ఉదయం నుంచే జనం సభకు చేరినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే విజయ్ రాత్రి ఏడు గంటలకు రావడం, ఆయన చూసేందుకు జనం ఎగబడటం తొక్కిసలాటకు కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే నిర్వాహకులు ఈ వాదనను కొట్టివేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్ (Karur)లో తొక్కిసలాట (Stampede) జరిగి 41 మంది మృతిచెందిన ఘటన ప్రకంపనలు సృష్టిస్తుండటంతో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళానాడు రాష్ట్రవ్యాప్త పర్యటనను రెండు వారాల పాటు ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో టీవీకే తెలియజేసింది.
'ఎందరో ప్రియతములను కోల్పోయిన ప్రస్తుత బాధాకర పరిస్థితుల్లో మా పార్టీ నేత పబ్లిక్ మీటింగ్ కార్యక్రమాలను రెండు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేశాం. బహిరంగ సభలకు సంబంధించిన సమాచారాన్ని మరోసారి తెలియజేస్తాం' అని టీవీకే ఆ ప్రకటనలో తెలిపింది.
బహిరంగ సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినప్పటికీ ఆ కుటుంబాలను విజయ్ ఇంకా కలుసుకోవాల్సి ఉంది. మంగళవారం నాడు ఒక రికార్డెడ్ వీడియోలో త్వరలోనే బాధితులను కలుసుకుంటానని విజయ్ తెలిపారు. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటంతో విజయ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 10,000 మందికి సరిపడే సభకు 30,000 మంది వచ్చారని, భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం, సరైన ఆహారం, మంచినీటి సదుపాయాలను నిర్వాహకులు కల్పించకపోవడం వంటి తప్పిదాలే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఉదయం నుంచే జనం సభకు చేరినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే విజయ్ రాత్రి ఏడు గంటలకు రావడం, ఆయన చూసేందుకు జనం ఎగబడటం తొక్కిసలాటకు కారణమని ఆరోపిస్తున్నారు. అయితే నిర్వాహకులు ఈ వాదనను కొట్టివేస్తున్నారు. తాము గతంలో పలు భారీ ర్యాలీలు నిర్వహించామని, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెబుతున్నారు. డీఎంకే స్థానిక నేతలు కుట్ర చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే అధికార డీఎంకే ఆ ఆరోపణలను కొట్టివేసింది.
తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకేలో నెంబర్-2గా ఉన్న విజయ్ సన్నిహితుడు ఎన్.ఆనంద్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమిళనాడు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కూడా ఆరోపణలు చేశారు. టీవీకే కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి, సౌత్ సిటీ కోశాధికారిని అరెస్టు చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఇలాంటి పరిస్థితిని తానెప్పుడూ చూడలేదని, త్వరలోనే బాధిత కుటుంబాలను కలుసుకుంటానని చెబుతూ విజయ్ తన వీడియో సందేశంలో భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే తనపై తీర్చుకోవచ్చని, కానీ తన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
మీరే పీఎం అయితే.. ఒవైసీ ఆసక్తికర సమాధానం
ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్..!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి