Elephants-Haridwar: హైవేపై అడవి ఏనుగులు.. స్తంభించిన ట్రాఫిక్
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:05 PM
ఉత్తరాఖండ్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుంచి ఏనుగులు సమీపంలోని హైవేపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈలోపు ఏనుగులు మళ్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: జనావాసాలు పెరుగుతూ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటంతో అడవి జంతువులు జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఫలితంగా వాటితో పాటు జనాలు కూడా అపాయంలో పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఏనుగుల సమూహం అడవుల నుంచి హైవేపైకి దూసుకొచ్చిన వైనం కలకలానికి దారి తీసింది. రాజాజీ నేషనల్ పార్క్‌లోని ఆరు ఏనుగుల గుంపు హరిద్వార్-లక్సర్ హైవేపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఏనుగుల రాకను గమనించిన వాహనదారులు పక్కకు తప్పుకుని వాటికి దారి ఇచ్చారు. అవి తరలిపోయే వరకూ ఎదురు చూశారు. ఏనుగులు కొన్ని సమీప అడవుల్లోకి వెళ్లిపోయినా ఒకటి మాత్రం అక్కడే కాసేపు నిలబడి పరిసరాలను పరిశీలించింది. అనంతరం, మిగతా ఏనుగులను అనుసరిస్తూ వెళ్లిపోయింది (Haridwar Elephants on Highway).
ఉత్తరాఖండ్‌లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో ఆహారం కోసం వనాలను వీడుతున్న ఏనుగులు పొలాల్లోకి రావడం, పంటలను నాశనం చేయడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏనుగులను ఆపడం సవాలుగా మారింది. దీంతో, అవి ఎప్పుడు దూసుకొస్తాయో తెలియక స్థానికులు భయాందోళనలతో జీవిస్తున్నారు.
నవంబర్‌లో రిషీకేశ్ వద్ద ఏనుగు ఓ 12 ఏళ్ల బాలుడిపై దాడి చేయడంతో చిన్నారి మరణించాడు. కాలూవాలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా దూసుకొచ్చిన ఏనుగు చిన్నారిని తొండంతో ఎత్తి కిందపడేసింది. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి