US India Trade Talks Resume: అమెరికా భారత్ వాణిజ్య చర్చలు మళ్లీ షురూ
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:42 AM
భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. సోమవారమే భారత్‌కు చేరుకున్న అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. సోమవారమే భారత్‌కు చేరుకున్న అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై మంగళవారం చర్చలు ప్రారంభించారు. తమ సరుకులకు గేట్లు బార్లా తెరవాలని, రష్యా నుంచి చమురు కొనొద్దనే డిమాండ్లతో భారత్‌పై అమెరికా 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలు తేలే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు కూడా. ఈ క్రమంలో గత నెల 25 నుంచి జరగాల్సిన ఆరో దశ చర్చలు నిలిచిపోయాయి. అడ్డగోలు సుంకాల ఒత్తిడికి భారత్ తలొగ్గకపోవడం, సుంకాల ప్రభావం పడిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్కెట్లపై దృష్టిసారించడం నేపథ్యంలో.. అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే చర్చలు పునః ప్రారంభమయ్యాయి. అమెరికా తరఫున ఆ దేశ దక్షిణ, మధ్య ఆసియా సహాయక వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని బృందం, భారత్ తరఫున వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాకేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం చర్చలు జరుపుతున్నాయి. ఇరు దేశాల మధ్య చాలా అంశాల్లో ఏకాభిప్రాయం ఉన్నా.. అమెరికాకు చెందిన వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు భారత్ గేట్లు తెరవాలన్న డిమాండ్‌పైనే పీటముడి నెలకొంది. అమెరికా మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులు, పాల పదార్థాలన్నీ దాదాపుగా జన్యుమార్పిడి ఉత్పత్తులు కావడం, తక్కువ ధరకు వచ్చే ఆ ఉత్పత్తులతో మన దేశ వ్యవసాయ, పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో.. భారత్ వాటి దిగుమతులకు అంగీకరించడం లేదు. కాగా ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్యశాఖ, అమెరికా అధికారులు వేర్వేరుగా ప్రకటించారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపై ప్రతివారం వర్చువల్ పద్ధతిలో చర్చలు కొనసాగుతాయని, నేరుగా మరోసారి భేటీ అయ్యే తేదీని త్వరలో నిర్ణయిస్తారని వాణిజ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దిగివస్తోందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాపై అన్ని పెద్ద దేశాల కన్నా ఎక్కువ టారి్‌ఫలు విధించే భారత్.. ఇప్పుడు దిగివస్తోంది. భారత్ వేసే సుంకాలు చాలా ఎక్కువ. అవే వాణిజ్యానికి ప్రధాన అడ్డంకులు. ఇలా అధిక సుంకాలు వేసే ఇతర దేశాలతో ఎలా వ్యవహరించామో.. భారత్‌తోనూ అలాగే వ్యవహరించాల్సి ఉంది..’’ అని పేర్కొన్నారు.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి