US Imposes OneTime: హెచ్ 1బీ రుసుము ఒక్కసారే
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:07 AM
అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల రుసుమును విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోగా..
కొత్త వీసాదారులకు మాత్రమే
ప్రస్తుత వీసాదారులకు వర్తించదు
రెన్యువల్స్‌కు కూడా రుసుము ఉండదు
హెచ్-1బీ వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు
లక్ష డాలర్ల ఫీజుపై శ్వేతసౌధం వివరణ
భారతీయులకు అత్యవసర హెల్ప్‌లైన్
వాషింగ్టన్, సెప్టెంబరు 21: అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల రుసుమును విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోగా.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో లక్ష డాలర్ల రుసుముపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’లో స్పష్టత ఇచ్చారు. హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక రుసుము కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు లక్ష డాలర్ల రుసుము వర్తించదని పేర్కొన్నారు. రాబోయే హెచ్-1బీ వీసాల లాటరీకి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఎలాంటి రుసుమూ విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లొచ్చని, తిరిగి అమెరికా రావచ్చని.. కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్‌టైమ్ రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామన్నారు. అంటే ఎఫ్-1 స్టూడెంట్ వీసా సహా ఎలాంటి అమెరికా వీసాలు కలిగిన వారు కూడా ఈ లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిబంధన సెప్టెంబరు 21 కంటే ముందే దాఖలు చేసిన హెచ్-1బీ వీసా పిటిషన్‌లకు వర్తించదని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎస్) కూడా వెల్లడించింది. ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లూ దీని పరిధిలోకి రావని తెలిపింది. ప్రస్తుతం హెచ్1బీ వీసా చెల్లుబాటులో ఉన్నవారు అమెరికాకు రాకపోకలు సాగించవచ్చని యూఎ్‌ససీఐఎస్ డైరెక్టర్ జోసఫ్ వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
భారతీయులకు అత్యవసర హెల్ప్‌లైన్
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా రుసుమును భారీగా పెంచడంతో నెలకొన్న గందరగోళ, ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయ ఐటీ నిపుణుల కోసం వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేకంగా అత్యవసర హెల్ప్‌లైన్ నంబరును ఏర్పాటు చేసింది. ఇందుకోసం ‘‘అత్యవసర సహాయం కోసం భారతీయులు సెల్ నంబరు 1-202-550-9931కు ఫోన్ లేదా వాట్సాప్ చేయాలి. ఈ నంబరు కేవలం భారతీయులకు, అదీ అత్యవసర సహాయం కోసమే. సాధారణ కాన్సులర్ వివరాల కోసం కాదు’’ అని భారత దౌత్య కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. హెచ్-1బీ వీసాల్లో అత్యధికంగా 72 శాతం వరకు భారతీయులకే కేటాయిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి