Share News

Donald Trump: ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:09 AM

ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై అడ్డగోలు సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అక్కడి ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు షాకిచ్చింది.

Donald Trump: ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

  • ‘ఐఈఈపీఏ’ చట్టం అడ్డగోలు టారిఫ్‌లు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు ఇవ్వలేదు

  • అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పు

  • సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలుగా

  • అక్టోబరు 14 వరకు తీర్పు అమలు నిలిపివేత

  • తీర్పు ఏకపక్షం.. టారి్‌ఫలు కొనసాగుతాయి

  • సుంకాలు తొలగిస్తే అమెరికా సర్వనాశనం

  • ఉత్పత్తిదారులు, రైతులకు తీవ్ర నష్టం: ట్రంప్‌

న్యూయార్క్‌, ఆగస్టు 30: ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై అడ్డగోలు సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అక్కడి ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు షాకిచ్చింది. వివిధ దేశాలపై ట్రంప్‌ వేసిన భారీ సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సుంకాల విధింపు కోసం ట్రంప్‌ ‘అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)’ను అడ్డుపెట్టుకున్నారని.. నిజానికి ఆ చట్టం అధ్యక్షుడికి అడ్డగోలు సుంకాల విధింపు అధికారాన్ని ఇవ్వలేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు 11మంది జడ్జీలతో కూడిన కోర్టులో ఏడుగురు సుంకాలకు వ్యతిరేకంగా, నలుగురు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మెజారిటీ మేరకు సుంకాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. అయితే దీనిపై ట్రంప్‌ యంత్రాంగం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును అక్టోబర్‌ 14 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ట్రంప్‌ టారి్‌ఫలు అన్యాయం, చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై తొలుత విచారించిన దిగువస్థాయి ఫెడరల్‌ కోర్టు..ట్రంప్‌ సుంకాలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. కానీ దానిపై ట్రంప్‌ యంత్రాంగం ‘ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు ఫర్‌ ది ఫెడరల్‌ సర్య్కూట్‌’ను ఆశ్రయించగా... దిగువ కోర్టు తీర్పును నిలిపివేసింది. ఇప్పుడు ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు కూడా ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ తిరిగి అప్పీలు చేయనున్న నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.


అమెరికా నాశనమవుతుంది: ట్రంప్‌

ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పుపై ట్రంప్‌ ‘ట్రూత్‌’ వేదికగా స్పందించారు. ప్రపంచ దేశాలపై తాము విధించిన టారి్‌ఫలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. కోర్టు తీర్పు పూర్తిగా ఏకపక్షం, పక్షపాతంతో కూడుకున్నదని విమర్శించారు. అయినా చివరికి అమెరికాయే గెలుస్తుందని పేర్కొన్నారు. ‘‘కోర్టు తీర్పు అమలైతే.. అమెరికా సర్వనాశనం అవుతుంది. ఇక్కడి ఉత్పత్తిదారులు, రైతులు, పనివారు తీవ్రంగా నష్టపోతారు. వివిధ దేశాలు అమెరికా దిగుమతులపై అన్యాయంగా విధిస్తున్న సుంకాలను, భారీ వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి వాటిపై సుంకాలు విధించాల్సిందే. సుంకాల అమలుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందన్న నమ్మకముంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


వలసదారుల అంశంలోనూ దెబ్బ!

అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్నవారిని వేగంగా తిప్పిపంపేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చేపట్టిన చర్యలను వాషింగ్టన్‌ డీసీ డిస్ట్రిక్ట్‌ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వలసదారులను జడ్జి ఎదుట హాజరుపర్చకుండా, వారు చెప్పే అంశాలను పరిశీలించకుండా నేరుగా తిప్పిపంపేయడం సరికాదని కోర్టు జడ్జి జియా కోబ్‌ పేర్కొన్నారు. వలసదారులకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఇచ్చిన వెసులుబాట్లను కాదనలేమని స్పష్టం చేశారు.

సుంకాలు నిలిచిపోతాయా?

1977 నాటి అమెరికా ‘అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)’ ప్రకారం.. వివిధ దేశాలు, వాటి నుంచి వచ్చే దిగుమతులు అమెరికాకు ముప్పుగా పరిణమించే పరిస్థితులు నెలకొంటే, అధ్యక్షుడు అత్యవసరంగా ఆయా దేశాలపై పలురకాల ఆంక్షలు విధించవచ్చు. ఇందుకోసం చట్టసభ (కాంగ్రెస్‌) అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు ఈ చట్టం పరిధిలోకి రావని, అడ్డగోలు సుంకాల వసూలు చేసేందుకు ట్రంప్‌కు చట్టసభ అనుమతి ఇవ్వలేదని కోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సుంకాలు నిలిచిపోతాయా, ట్రంప్‌ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే అధ్యక్షుడిగా ఉన్న అధికారాలతో ట్రంప్‌ సుంకాలు విధించేందుకు ఇతర చట్టాలు కూడా ఉన్నాయని.. కాకపోతే ట్రంప్‌ ఇప్పటిలా దూకుడుగా, ఇష్టం వచ్చినట్టు టారి్‌ఫలు వేయడం కుదరదని అమెరికా చట్టాల నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 06:00 AM