Share News

Amit Shah Uproar Over Bills: పదవీచ్యుతి బిల్లులపై గగ్గోలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:42 AM

తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్‌సభ అట్టుడికింది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Amit Shah Uproar Over Bills: పదవీచ్యుతి బిల్లులపై గగ్గోలు

అరెస్టైన పీఎం, సీఎం, మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన

  • లోక్‌సభలో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్‌షా

  • మూజువాణి ఓటుతో జేపీసీకి నివేదన

  • అవి దుర్మార్గం, క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం

  • రాజ్యాంగం, సమాఖ్యపై దాడి అని ఆందోళన

  • బిల్లు ప్రతుల్ని చింపి షాపైకి విసిరిన సభ్యులు

  • షావైపు దూసుకెళ్లే యత్నం.. అడ్డుకున్న మార్షల్స్‌

  • గుజరాత్‌ హోంమంత్రిగా అరెస్టైన అమిత్‌షా విలువలపై మాట్లాడటమేంటి?: వేణుగోపాల్‌

  • నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశా: షా

  • మధ్యయుగాల నాటికి దేశం తిరోగమనం

  • రాజ్యాంగంపై దాడి చేస్తున్నవారికి, రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది: రాహుల్‌

  • ఇది ప్రజాస్వామ్యంపై దాడి: వామపక్షాలు

  • అవినీతిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాల ప్రయత్నం.. బీజేపీ ప్రత్యారోపణ

  • ‘ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు’కు ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్‌సభ అట్టుడికింది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వెంటనే ఆ బిల్లులు దుర్మార్గం, క్రూరమైనవంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. సభా కార్యకలాపాలను స్తంభింపజేశాయి. కొందరు ఎంపీలు బిల్లు ప్రతులను చింపి అమిత్‌షా వైపు విసిరారు. మరోవైపు బిల్లులకు మద్దతుగా ప్రతిపక్షాలను తప్పుపడుతూ అధికారపక్ష సభ్యులు నినాదాలకు దిగారు. దీనితో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు ప్రతిపక్ష సభ్యులు అమిత్‌షాను ఘెరావ్‌ చేసేందుకు దూసుకురాగా.. కేంద్ర మంత్రులు రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, కిరణ్‌ రిజిజు అడ్డుగా నిలిచారు. వెంటనే మార్షల్స్‌ కూడా వచ్చి అమిత్‌షాకు రక్షణ వలయం ఏర్పాటుచేశారు. ఈ గందరగోళం మధ్య మూడు బిల్లులను మూజువాణి ఓటుతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అప్పగిస్తున్నట్టుగా స్పీకర్‌ ప్రకటించారు. పార్లమెంటు తర్వాతి సమావేశాల్లో తొలివారం చివరిరోజున దీనిపై నివేదికను సమర్పించాలని సూచించారు. తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్‌ మూడో వారంలో ప్రారంభంకావొచ్చని అంచనా. అప్పటికల్లా జేపీసీ నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. జేపీసీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఐదేళ్లకుపైగా శిక్షపడే కేసుల్లో అరెస్టయి 30రోజులకుపైగా జైలులో ఉండే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను.. 31వ రోజున ఆటోమేటిగ్గా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా మూడు బిల్లులను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపొందించింది. మూడు బిల్లులు ఒకే అంశానికి చెందినవే అయినా.. రాజ్యాంగంలోని విభిన్నమైన ఆర్టికల్స్‌ను సవరించేందుకు వీలుగా కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మరో బిల్లు, జమ్మూకశ్మీర్‌కు సంబంధించి మూడో బిల్లు సిద్ధం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు.


రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. సాధారణంగా నేరం రుజువయ్యే వరకు ఎవరైనా నిర్దోషులేనని, కానీ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఈ సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ పేర్కొన్నారు. కీలకమైన బిల్లు ప్రతులను సభ్యులకు అందజేయకుండా హడావుడిగా లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటని ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే ముందు హడావుడిగా బిల్లులను ప్రవేశపెట్టడం ఏమిటని కేసీ వేణుగోపాల్‌ ప్రశ్నించారు. గతంలో గుజరాత్‌ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టయిన అమిత్‌షా.. ఇప్పుడు రాజకీయాల్లో నైతికతపై మాట్లాడుతూ, బిల్లులు ప్రవేశపెట్టడం ఏమిటని విమర్శించారు.

GCH.jpg

ఇది ప్రజాస్వామ్యంపై దాడి: వామపక్షాలు

పదవుల నుంచి తొలగింపు బిల్లులు దేశ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలకు గొడ్డలిపెట్టు అని వామపక్షాలు మండిపడ్డాయి. ‘‘ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలి’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న సీఎం, మంత్రులను తొలగించడమంటే.. రాష్ట్రాలను ఎవరు పాలించాలనేదానిపై కేంద్రం పెత్తనమేనని, ఇది సమాఖ్య విధానానికి విరుద్ధమని సీపీఐ ఎంపీ సందో్‌షకుమార్‌ విమర్శించారు. కాగా, బీజేపీ ఓట్ల చోరీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నమని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ విమర్శించారు. తమ అవినీతిని, అవినీతి నేతలను కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు కేంద్రం తెచ్చిన మూడు బిల్లులను తప్పుపడుతున్నాయని బీజేపీ మండిపడింది.

‘పదవుల తొలగింపు’ బిల్లులేంటి?

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్షపడిన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించవచ్చు. కేసులు నమోదవడం, జైలులో ఉండటం వల్ల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్‌ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లారు. జైలులో ఉన్న 6నెలల పాటు కూడా ఆయన సీఎంగానే కొనసాగారు. ఇటీవల తమిళనాడు మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ అరెస్టయి జైలులో ఉన్నా పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో పదవి నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలోనే కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతిని నిరోధించడానికంటూ కేంద్రం 3బిల్లులు తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. కనీసం ఐదేళ్లు, ఆపై శిక్షపడే నేరారోపణలపై అరెస్టయి 30రోజులకుపైగా జైలులో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిగ్గా పదవి కోల్పోతారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నిబంధనల మేరకు తిరిగి ఆయా పదవులను చేపట్టవచ్చు.


మధ్యయుగాలకు తిరోగమిస్తున్నాం: రాహుల్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను చూస్తుంటే దేశం మధ్యయుగాల నాటి రాచరికానికి తిరోగమిస్తున్నట్టు ఉందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. పదవుల నుంచి తొలగింపు బిల్లులకు నిరసనగా ఆయన నలుపురంగు టీషర్టు ధరించి పార్లమెంటుకు వచ్చారు. ‘‘మనం మళ్లీ మధ్యయుగాల నాటికి తిరోగమిస్తున్నాం. ఎవరైనా తమ మాట వినకపోయినా, వారి ముఖం నచ్చకపోయినా సరే రాజులు వారిని తొలగించేవారు. ఇప్పుడు కూడా ఈడీని ప్రయోగించి, ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ప్రజాస్వామికంగా ఎన్నికైన వారిని 30 రోజుల్లో తప్పించేయవచ్చు’’ అని విమర్శించారు. ఇక కేంద్రం తెచ్చిన బిల్లులు అప్రజాస్వామికమని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా తెస్తున్నామని చెబుతూ ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఎవరైనా మంత్రిని, సీఎంను అరెస్టు చేసి 30 రోజులు జైలులో పెడితే.. వారి నేరమేదీ తేలకపోయినా, శిక్షపడకపోయినా కూడా పదవి నుంచి తొలగించడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు.

నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశా: షా

ఈ బిల్లులను హడావుడిగా ఏమీ తీసుకురాలేదని, ప్రతిపక్షాల ఎంపీలు కూడా సభ్యులుగా ఉండే జేపీసీకి నివేదించామని అమిత్‌ షా చెప్పారు. బిల్లులపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, సూచనలను జేపీసీకి ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్‌ విమర్శలను తిప్పికొడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని, అయినా నైతిక విలువలు పాటిస్తూ అరెస్టుకు ముందే గుజరాత్‌ హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని అమిత్‌షా చెప్పారు. కోర్టు నిర్దోషిగా తేల్చే వరకు కూడా ఎలాంటి పదవులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నా రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌ సోహ్రబుద్దీన్‌ షేక్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి 2010 జూలైలో గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న అమిత్‌షాను సీబీఐ అరెస్టు చేసింది. కొంతకాలంపాటు సబర్మతి జైలులో ఉన్నారు. అయితే అమిత్‌షా నేరం చేశారనేందుకు ఆధారాలేమీ లేవని, ఆయన నిర్దోషి అని 2014 డిసెంబర్‌లో సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.

Updated Date - Aug 21 , 2025 | 03:42 AM