Online Gaming Bill 2025: లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:13 PM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఆగడాలు పెచ్చు మీరాయి. అలాంటి వేళ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఆగడాలు పెచ్చు మీరాయి. అలాంటి వేళ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.. ఈ - స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌కు ప్రోత్సాహం, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారు. అలాగే యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి గేమ్స్‌పై నిషేధం విధిస్తారు.
ఈ - స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు, అలాగే శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సోషల్, విద్యా గేమ్స్ అభివృద్ధికి కేంద్రం మద్దతు తెలుపుతోంది. తద్వారా భారతీయ విలువలతో గేమ్స్ ప్రోత్సాహం అందిస్తుంది. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ప్రకటనలు, లావాదేవీలు నిషేధం – బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ బ్లాక్ చేస్తారు. కేంద్ర స్థాయిలో ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు సంసిద్ధత. నిబంధనల ఉల్లంఘనకు జైలు శిక్షలు, రూ. కోట్లాది జరిమాన విధిస్తారు. డిజిటల్ ఇండియాలో సమతుల్యత, వినూత్నతకు ప్రోత్సాహం, సమాజ రక్షణకు ఈ బిల్లు పాటుపడుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు.