Trump Gold Card: పది లక్షల డాలర్లకు ట్రంప్ గోల్డ్ కార్డు
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:27 AM
హెచ్-1బీ వీసాలపై రుసుములు భారీగా పెంచిన ట్రంప్.. విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు మరో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చారు. అమెరికా ప్రగతికి దోహదపడే...
వాషింగ్టన్, సెప్టెంబరు 20: హెచ్-1బీ వీసాలపై రుసుములు భారీగా పెంచిన ట్రంప్.. విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు మరో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చారు. అమెరికా ప్రగతికి దోహదపడే అసాధారణ ప్రతిభావంతులైన విదేశీయుల కోసమంటూ ‘‘ట్రంప్ గోల్డ్ కార్డు’’ అనే పథకాన్ని శనివారం ప్రారంభించారు. పది లక్షల డాలర్లు(దాదాపు రూ.9కోట్లు) అమెరికా ఖజానాకి చెల్లించిన వారికి ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ ఇచ్చి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశం(గ్రీన్ కార్డు తరహాలో) కల్పిస్తామని ప్రకటించారు. అలాగే, కార్పొరేట్ల కోసం ప్రత్యేకంగా ‘ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డు’ను ప్రారంభించారు. 20 లక్షల డాలర్లు(దాదాపు రూ.18 కోట్లు) అమెరికా ఖజానాకు చెల్లించిన కార్పొరేట్ సంస్థలకు ఈ కార్పొరేట్ గోల్డ్ కార్డులు జారీ చేస్తారు. కార్పొరేట్ సంస్థలు ఈ కార్డు సాయంతో తమకు నచ్చిన ఓ విదేశీ ఉద్యోగిని శాశ్వత నివాసి కోటాలోఅమెరికాకు పంపవచ్చు. అంతేకాక, తమ అవసరాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని వెనక్కు రప్పించి ఆ స్థానంలో మరొకరిని పంపవచ్చు. ఈ బదిలీ ప్రక్రియకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ గోల్డ్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ట్రంప్.. అమెరికాకు లబ్ధి చేకూర్చే పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, డీహెచ్‌ఎ్‌స(డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ) పరిశీలన తర్వాత ఎంపికైన దరఖాస్తుదారులు గోల్డ్ కార్డుకు డబ్బు జమ చేయాలి. జమ చేసిన డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వరు. కాగా, 50 లక్షల డాలర్లకు ఇచ్చే ట్రంప్ ప్లాటినమ్ కార్డును త్వరలో అందుబాటులోకి తెస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్లాటినమ్ కార్డు కలిగిన వారు ఓ ఏడాదిలో 270 రోజుల పాటు అమెరికాలో ఉండవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News