Turmoil for Indian IT Professionals: హెచ్1 బాంబు
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:44 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ నిపుణులపై ఆటంబాంబు పేల్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య తరగతి కుటుంబాల్లో భారీ సంక్షోభం సృష్టించారు. అమెరికాలో...
వీసా దరఖాస్తు రూ.90 లక్షలు.. భారతీయ ఐటీ నిపుణులపై ట్రంప్ అంకుశం
అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం
అమెరికాకు రూ.90 లక్షల కోట్ల ఆదాయం
హెచ్1బీ లబ్ధిదారుల్లో 71ు భారతీయులే
సగటు జీతమే లక్ష డాలర్లు ఉండదు
ఏడాదికోసారి లక్ష డాలర్లు చెల్లించాలి
హెచ్1బీ కోసం కంపెనీ అంత భరిస్తుందా?
గ్రీన్‌కార్డు దరఖాస్తు తర్వాతా చెల్లించాల్సిందే
హెచ్1బీ ముగిసిందంటే గుండెల్లో రైళ్లే
కంపెనీకి బరువనిపిస్తే ఉపాధికే ఎసరు
నేటి నుంచే అమల్లోకి వీసా రుసుము
విదేశాల్లో ఉన్న వాళ్లు అమెరికాకు పరుగులు
భారత్‌కు పండగల ప్రయాణాలూ రద్దు
వీసా స్టాంపింగ్‌కు వచ్చిన వాళ్లు
లక్ష డాలర్లు కట్టినట్లు రుజువు చూపాల్సిందే
కంపెనీ చెల్లించకపోతే భవిత గల్లంతే
అత్యంత పనిమంతులకే అవకాశం
అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్య
తెలుగు రాష్ట్రాల నుంచే 35 వేల మంది
స్టూడెంట్ వీసాదారులపైనా తీవ్ర ప్రభావం
హెచ్1బీ ఇప్పటికే కష్టం.. ఇకపై అసాధ్యమే!
వాషింగ్టన్, సెప్టెంబరు 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ నిపుణులపై ఆటంబాంబు పేల్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య తరగతి కుటుంబాల్లో భారీ సంక్షోభం సృష్టించారు. అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన హెచ్1బీ వీసాలకు కొత్తగా లక్ష డాలర్ల ఫీజును ప్రకటించారు. అంటే, దాదాపు 90 లక్షల రూపాయలు. ప్రస్తుతం హెచ్1బీ దరఖాస్తుకు చెల్లిస్తున్న రెండు వేల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల ఫీజుకు ఇది అదనం. ప్రస్తుతం అమెరికాలో భారతీయుల సగటు వేతనమే లక్ష డాలర్లు లేదు. అలాంటి కొలువు కోసం ప్రతీ హెచ్1బీ దరఖాస్తుతో పాటు లక్ష డాలర్లు చెల్లించాల్సిందే. అదీ అభ్యర్థిని ఎంచుకుని హెచ్1బీకి స్పాన్సర్ చేస్తున్న కంపెనీయే చెల్లించాలి. లక్ష డాలర్ల ఫీజును జత చేయనిదే హెచ్1బీ దరఖాస్తును పరిశీలించరు. ఏటా లక్షడాలర్లు చెల్లిస్తేనే హెచ్1బీ బతికి ఉంటుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై శుక్రవారం సాయంత్రం(అమెరికా కాలమానం ప్రకారం) సంతకం చేశారు. అది ఈ నెల 21 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుంది.
ఆ తర్వాత దాన్ని పొడిగించాలా? వద్దా అన్నది అప్పటికి సమీక్షించి, నిర్ణయిస్తారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇప్పటికే హెచ్1బీ వీసా పొంది అమెరికాలో ఉద్యోగం చేస్తూ వీసా రెన్యువల్ కోసం అమెరికా గడ్డను దాటి స్వదేశం వచ్చిన వాళ్లు న్యూయార్క్ కాలమానం ప్రకారం సెప్టెంబరు 20 అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికా గడ్డమీద తర్వాత అడుగు పెట్టాలంటే వాళ్లు పని చేస్తున్న కంపెనీ లక్ష డాలర్లు హెచ్1బీ వీసా ఫీజు చెల్లించాల్సిందే. లేదంటే ఇంటికి వెళ్లాల్సిందే. ఇమ్మిగ్రేషన్‌లో దాన్ని పరిశిలించి కానీ లోపలికి వదలరు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. కొత్తగా వీసా స్టాంపింగ్ చేయించుకున్న వాళ్లు సెప్టెంబరు 21 తర్వాత అమెరికా వెళ్లాలి అన్నా ఇమ్మిగ్రేషన్ వద్ద భర్త/తండ్రి పని చేస్తున్న కంపెనీ లక్ష డాలర్ల ఫీజు చెల్లించినట్లుగా ఆధారం చూపించాలి. చూపించలేకపోతే ఆపేస్తారు. వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ కొత్త ఆదేశాల నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ వద్ద గందరగోళానికి అవకాశం ఉంటుంది కాబట్టి, చాలా కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా వదిలి వెళ్లొద్దని చెబుతున్నాయి. తాజాగా ట్రంప్ ఆదేశం వెలువడగానే 29 గంటల డెడ్‌లైన్‌ను ఉపయోగించుకొని విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులను ఏదో ఒక మార్గంలో తిరిగి వచ్చేయాలని అత్యవసర సందేశాలు పంపాయి. దాంతో విమానాశ్రయాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సక్రమ వీసాలు ఉన్నవారిని ఆపేది లేదని, కొత్తగా వీసా రెన్యువల్ చేసుకొని వచ్చే వాళ్లకే లక్ష డాలర్ల నిబంధన వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల హెచ్1బీ ఉద్యోగులకు దేశంలో ఉన్నంతకాలం కొత్త ఫీజు భారం ఉండదు. మూడేళ్ల గడువు పూర్తయి హెచ్1బీ రెన్యువల్‌కు వెళితే మాత్రం మళ్లీ ఏటా లక్ష డాలర్ల ఫీజు భారం తప్పదు. హెచ్1బీ ఆరేళ్లు పూర్తయి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కంపెనీలు హెచ్1బీ పొడిగిస్తున్నపుడు ఏటా లక్ష డాలర్ల భారం తప్పదు.
హెచ్1బీల దుర్వినియోగం
ఉత్తర్వు మీద సంతకం చేస్తూ ట్రంప్ మాట్లాడారు. హెచ్1బీలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. తమకు గొప్ప పనివాళ్లు కావాలని, తక్కువ స్థాయి జీతాలతో పనిచేసే సామాన్య వ్యక్తుల కోసం అమెరికా ప్రజల ఉద్యోగాలను ఫణంగా పెడుతున్న కంపెనీలకు చెక్ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, అమెరికాలో ఏటా 2,81,000 మంది ఉద్యోగాల ద్వారా గ్రీన్‌కార్డులు పొందుతున్నారని చెప్పారు. వారి సగటు వార్షిక ఆదాయం 66,000 డాలర్లని తెలిపారు. దాంతో సాధారణ ప్రజల కన్నా వీరు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అభ్యర్థించే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. తమకు అమెరికా ఉద్యోగాలు దొంగిలించే వారికన్నా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించే గొప్ప వ్యక్తులు కావాలని అన్నారు. తాజా పథకంతో అమెరికా ఖజానాకు ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ.90 లక్షల కోట్లు) ఆదాయం సమకూరుతుందన్నారు.
కంపెనీల విధానాల్లో మార్పులు
ట్రంప్ నిర్ణయం తర్వాత కంపెనీలు తన వ్యూహాలను మార్చుకుంటాయని భావిస్తున్నారు. జీతాల్లో కోతలతో లాభాలు పెంచుకోవడం లాంటి అడ్డదారుల నుంచి విరమించుకోవచ్చు. ఆటోమేషన్, విదేశాలకు పనిని అవుట్ సోర్స్ చేయడం, అమెరికన్ల నైపున్యాలు పెంచడం మీద దృష్టి సారించే అవకాశం ఉంది. విదేశీ నిపుణులు అమెరికాను వదిలి వేరే దేశాలను వెతుక్కుంటారని భావిస్తున్నారు. హెచ్1బీ గడువు ముగిసిన ప్రతీ ఉద్యోగి తాను కంపెనీకి అవసరమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిపుణులను అమెరికాకు తెచ్చుకోవడానికి హెచ్1బీ కాకుండా ఓ-1, ఈబీ-1ఏ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కంపెనీలు చూసే అవకాశం ఉంది.
కోర్టుల్లో నిలబడుతుందా?
ట్రంప్ ఉత్తర్వు కోర్టుల ముందు నిలబడుతుందా? అన్న అనుమానం కూడా ఉంది. గత ఉత్తర్వుల లాగే దీనిపైనా కోర్టులు స్టేలు విధిస్తాయని భావిస్తున్నారు. అలాంటి ఫీజులను విధించే అధికారం కాంగ్రె్‌సకే కానీ, అమెరికా అధ్యక్షుడికి లేదని పలువురు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. వీసా ఫీజులు వాటి ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చును వసూలు చేసే విధంగా ఉండాలి కానీ దాని నుంచి లాభాలను గడించే విధంగా ఉండరాదని చెబుతున్నారు.
భారతీయుల జీతం ఎంత?
అమెరికాలో సగటు భారతీయ ఐటీ ఉద్యోగి వార్షిక వేతనం 95 వేల డాలర్లు ఉంటుంది. నివసించే ప్రాంతాన్ని బట్టి వేతనం మారుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 60 వేల నుంచి 80 వేల డాలర్లు ఉంటుంది. ఐదేళ్ల సీనియారిటీ ఉన్న వాళ్లకు లక్ష డాలర్ల నుంచి లక్షన్నర డాలర్ల వరకు ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రెండు లక్షల డాలర్ల వరకు ఉంటుంది. హెచ్1బీ లబ్ధిదారుల్లో 71ు భారతీయులే కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News