Pahalgam Attack Escape: గుర్రం యజమానులతో బేరమే బతికించింది
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:18 AM
పెహల్గామ్ చేరేందుకు గుర్రాల యజమానులతో బేరమాడిన 28 మంది పర్యాటకులు, ఆ ఆలస్యం వల్ల ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మృత్యువు తలుపుదట్టిన వేళ క్షణకాలం ఆలస్యం ప్రాణాలను కాపాడింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మరీ.. అంతా? బాబ్బాబూ చార్జీలు కొంచెం తగ్గించరూ! పెహల్గాంకు వెళ్లేందుకు ఇలా గుర్రాల యజమానులను ఆ బృందం బతిమాలుకుంది! వారేమో కుదరదంటున్నారు.. వీరేమో బతిమాలుతునే ఉన్నారు! ఇలా ఓ 15 నిమిషాల పాటు బేరమాడటమే ఆ బృందం ప్రాణాలను కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ, పుణె, రత్నగిరి ప్రాంతాలకు చెందిన ఓ 28 మంది ఈనెల 17న కశ్మీర్‌లోని బైసారన్ లోయకు వెళ్లారు. 22న పెహల్గాం సమీపంలోకి చేరుకున్నారు.
గుర్రాల మీద అక్కడికి చేరుకొనేందుకు వాటి యజమానులతో బేరమాడి.. అప్పటికే పర్యాటకులను ఎక్కించుకొని వెళ్లిన గుర్రాల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే.. గుర్రాల నిర్వాహకుల్లో ఒకరు పరుగుపరుగున అక్కడికి వచ్చి.. ఎవ్వరూ అక్కడికి వెళ్లకండి.. అక్కడ కాల్పులు జరుగుతున్నాయి అని చెప్పాడు. ‘‘మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాం. ‘మేం బేరమాడకపోతే గనక.. ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల్లో మా పేర్లూ ఉండేవి’’ అని 28 మంది బృందంలో కురానే అనే వ్యక్తి భయంభయంగా చెప్పాడు.