Mahua Moitra: అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:56 AM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..
బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్య
ఆమెపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు
కోల్‌కతా, ఆగస్టు 29: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గురువారం నదియా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దును ఐదు దళాలు కాపాడుతున్నాయని, అది నేరుగా హోం మంత్రిత్వ శాఖ బాధ్యతని పేర్కొన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చొరబాట్లపై మాట్లాడుతున్నప్పుడు ముందు వరుసలో ఉన్న హోం మంత్రి చప్పట్టు కొట్టారన్నారు. ‘‘మన సరిహద్దులను కాపాడటానికి ఎవరూ లేకపోతే, వేరే దేశం నుంచి ప్రతి రోజూ ప్రజలు ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేయడంతోపాటు మన భూములను లాక్కుంటున్నారని మన దేశ పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి దేశ సరిహద్దులను రక్షించలేనప్పుడు, ప్రధాని స్వయంగా చొరబాటుదారులు మన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినప్పుడు తప్పు మీదా? మాదా? అని ఆమె ప్రశ్నించారు. మొయిత్రా వ్యాఖ్యల పట్ల బీజేపీ స్పందించింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోయిత్రా వ్యాఖ్యలు అసహ్యం కలిగించేలా, అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఆమె, టీఎంసీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించారు. ఒకవేళ కాకుంటే క్షమాపణలు చెప్పడమేకాకుండా మోయిత్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మొయిత్రా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించలేదు
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..