Jammu Kashmir: సరిహద్దుల్లో పాక్ కాల్పులు
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:45 AM
జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టర్‌లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అలజడి నెలకొంది. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపింది.

దీటుగా బదులిచ్చిన భారత సైన్యం
పాక్‌వైపు భారీగా ప్రాణ నష్టం..!
ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందన్న భారత అధికారులు
జమ్మూ, ఫిబ్రవరి 13: జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టర్‌లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అలజడి నెలకొంది. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపింది. వెంటనే తేరుకున్న భారత సైన్యం ప్రతిగా ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పాకిస్థాన్ వైపు భారీగా ప్రాణ నష్టం జరిగిందని భారత సైనికాధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను మాత్రం స్పష్టంగా చెప్పలేదు. వారి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ మృతి చెందిన కొంతమంది సైనికులకు ఓ పాక్ అధికారి నివాళులర్పిస్తున్న తేదీలేని వీడియో ఫేస్ బుక్‌లో దర్శనమిచ్చింది.
మరోవైపు గురువారం కృష్ణ ఘాటీ సెక్టర్‌లో ఓ భారత జవాను ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టి గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితి నిలకడగా ఉందని, కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. సరిహద్దుల వద్ద కాల్పుల ఘటన కొంత కలకలం రేపిన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం అన్ని అదుపులోకి వచ్చాయని తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం పూర్తి అప్రమత్తతో ఉందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, కాల్పుల విరమణకు సంబంధించి ఈ ఏడాదిలో తొలి ఘటన ఇదే కాగా సరిహద్దుల వద్ద కొన్ని రోజులుగా వివిధ సందర్భాలలో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది.