Share News

TCS Job Cuts: టీసీఎస్‌‌లో 12,000 ఉద్యోగాల కోత!

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:56 AM

దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ (టీసీఎస్‌).. భారీస్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2 శాతం మేర తగ్గించుకోనున్నట్టు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

TCS Job Cuts: టీసీఎస్‌‌లో 12,000 ఉద్యోగాల కోత!

  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించిన సంస్థ మధ్య, సీనియర్‌ స్థాయి ఉద్యోగులపై ప్రభావం

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ (టీసీఎస్‌).. భారీస్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2 శాతం మేర తగ్గించుకోనున్నట్టు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ సంస్థ వర్క్‌ఫోర్స్‌లో 2ు అంటే.. 12,200 మందికి పైగానే (మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069)!! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధ కారణంగా సాంకేతిక పరిజ్ఞానాలు మారుతున్న నేపథ్యంలో వ్యాపార గిరాకీ తగ్గిపోతుండడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘టీసీఎస్‌.. భవిష్యత్తు పరిణామాలకు సిద్ధంగా ఉండే సంస్థగా మారే ప్రయాణంలో ఉంది. ఆ ప్రయాణంలో భాగంగా.. సంస్థకు ఉపయోగపడని ఉద్యోగులను ఏడాది వ్యవధిలో తొలగిస్తాం. ఈ ప్రభావం మా అంతర్జాతీయ సిబ్బందిలో 2ు మందిపై.. ముఖ్యంగా మధ్య స్థాయి, సీనియర్‌ గ్రేడ్‌ ఉద్యోగులపై పడుతుంది’’ అని ఆ సంస్థ తన ప్రకటనలో వివరించింది. టీసీఎస్‌ సేవలను పొందేవారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా, తమ సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా.. ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రచించినట్టు వెల్లడించింది.


ఉద్యోగాలు కోల్పోయే తమ సిబ్బందికి ఇది కష్టకాలమేనన్న సంగతి తమకు తెలుసునని.. వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూనే కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని టీసీఎస్‌ పేర్కొంది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఉద్యోగాలు కోల్పోయేవారికి వారి నోటీ సు కాలానికి సంబంధించిన జీతాలు చెల్లించడమే కాక.. కోత ప్యాకేజీ కింద మరికొంత అదనంగా ఇస్తామని తెలిపింది. వారికి బీమా ప్రయోజనాలను కూడా పొడిగించే అవకాశాలను పరిశీలిస్తామని.. ‘ఔట్‌ప్లే్‌సమెంట్‌ ఆపర్చునిటీస్‌ (అంటే కొత్త ఉద్యో గం పొందడానికి వీలుగా రెజ్యూమ్‌ తయారు చేసుకోవడంలో, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం, కౌన్సెలింగ్‌ వంటి సహాయాలు)’ అందిస్తామని వెల్లడించింది. టీసీఎస్‌ సంస్థ ఇటీవలే తన ‘ఎంప్లాయ్‌మెంట్‌ బెంచ్‌ పాలసీ’ని సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై కొందరు ఉద్యోగులు లీగల్‌ కంప్లైంట్లు దాఖలు చేసిన కొద్దిరోజులకే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సవరించిన ‘ఎంప్లాయ్‌మెంట్‌ బెంచ్‌ పాలసీ’ ప్రకారం.. టీసీఎస్‌లో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి గరిష్ఠంగా 35 రోజులు మాత్రమే బెంచ్‌పై (ఏ ప్రాజెక్టులోనూ లేని సమయం) ఉండాలి. అలాగే.. ఏటా కనీసం 225 రోజుల ‘బిల్లబుల్‌ డేస్‌ (అంటే డబ్బులు వచ్చే ప్రాజెక్టుపై) పనిచేయాలి. అలా లేనివారిపై చర్యలు తీసుకునే విధంగా కొత్త విధానం ఉంది. కాగా.. టీసీఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం ఖర్చులను తగ్గించుకోవడానికి తీసుకున్న నిర్ణయంగా కాక, సంస్థ వ్యూహాత్మక మార్పు (స్ట్రాటజిక్‌ షిఫ్ట్‌)గా చూడాలని నిపుణులు భావిస్తున్నారు. టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌ సైతం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పనిచేసే తీరు మారుతోందని.. ఈ నేపథ్యంలో తాము భవిష్యత్తుకు సిద్ధంగా, వేగంగా స్పందించగలిగేలా ఉండాలని ఆయన వివరించారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:56 AM