Supreme Court Warns: న్యాయస్థానాలను రాజకీయ యుద్ధక్షేత్రాలుగా మార్చొద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:43 AM
న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై..
రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి
విమర్శలను ఎదుర్కొనే, భరించే సామర్థ్యం ఉండాలి: సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత
ఇలాంటి పిటిషన్లు వేస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ బీజేపీ తరఫున ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. రాజకీయ నాయకుడు మందమైన చర్మం(మొండి పట్టుదల, స్వభావం, విమర్శలను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం) కలిగి ఉండాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు రద్దవుతాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపి.. రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై రేవంత్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 1న హైకోర్టు రేవంత్‌రెడ్డికి అనుకూలంగా తీర్పునిస్తూ.. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. దీనిపై కాసం వెంకటేశ్వర్లు గత నెల 28న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌ల ధర్మాసనం విచారించింది. తెలంగాణ బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలను వినిపించేందుకు సిద్ధమవ్వగా.. ‘‘పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం’’ అని జస్టిస్ గవాయ్ ప్రకటించారు. మరోమారు రంజిత్ తన వాదనలను వినిపించే ప్రయత్నం చేయగా.. జస్టిస్ గవాయ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజకీయ పోరాటాలకు కోర్టులను ఉపయోగించవద్దని మేము పదేపదే చెబుతున్నాం. అటువంటి పిటిషన్లను తిరస్కరించాం. మేం మరోసారి చెప్పేది ఒక్కటే. మీరు రాజకీయ నాయకుడయితే వీటన్నింటినీ భరించే బలమైన నైపుణ్యం మీకు ఉండాలి. విమర్శలను ఎదుర్కొనే, భరించే సామర్థ్యం ఉండాలి. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి’’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా రంజిత్ తన వాదనలను వినిపించే ప్రయత్నం చేయగా.. సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్లు వేస్తే.. రూ.5 వేలు, 25 వేలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ.. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News