SC stray Dog Verdict: ఢిల్లీ వీధి కుక్కల సమస్యపై నేడు సుప్రీం కోర్టు తీర్పు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:19 AM
ఢిల్లీలో వీధి కుక్కల అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఇందుకు సంబంధించి సుప్రీం కార్యకలాపాలు లైవ్‌లో కూడా ప్రసారం చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దేశ రాజధానిలోని వీధి కుక్కలను షెల్టర్‌లకు తరలించాలంటూ సుప్రీం కోర్టు ఆగస్టు 11న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను షెల్టర్‌లకు తరలించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తక్షణం ఈ షెల్టర్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు చేపట్టిన చర్యలపై ఎనిమిది వారాల తరువాత నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఈ తీర్పునకు అడ్డుపడే వారిపై చర్యలు తప్పవని కూడా సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీంతో, దేశమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. జంతుప్రేమికులు నిరసన బాట పట్టారు. సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో వీధి కుక్కల అంశంపై ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగస్టు 14న మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ గతేడాది 37.15 లక్షల కుక్క కాటు కేసులు దేశవ్యాప్తంగా వెలుగు చూశాయని అన్నారు. రోజుకు సగటున 10 వేల కుక్క కాటు ఉదంతాలు బయటపడుతున్నాయని తెలిపారు. మునుపటి తీర్పులో కనీసం కొన్ని అంశాలపై అయినా స్టే విధించాలని జంతుప్రేమికుల సంఘాల తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ విషయంలో తుది ఆదేశాలు జారీ చేయనుంది. ఇక సుప్రీం కార్యకలాపాలను కూడా లైవ్‌గా ప్రసారం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్
పుతిన్, జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి