Supreme Court Stays Key Provisions: వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:43 AM
వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కనీసం ఐదేళ్లపాటు...
ఇస్లాంను కనీసం ఐదేళ్లు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వాలన్న రూలుపై స్టే
కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా ‘వక్ఫ్ ఆస్తి’గా పరిగణించరాదన్న నిబంధనా నిలుపుదల
ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో నలుగురు, రాష్ట్ర బోర్డుల్లో ముగ్గురికి మించరాదు
సీజేఐ జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు.. మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ
చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడమన్నది అత్యంత అరుదైన కేసుల్లోనేనని వ్యాఖ్య
చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదనలకు ఈ ఆదేశాలు అడ్డంకి కావని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది. చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలను నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లకు కొంతమేరకు రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. ‘‘మొత్తం చట్టంపైనే స్టే విధించాల్సిన అవసరం లేదని గుర్తించాం. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది. వక్ఫ్ చట్టంపైనే స్టే విధించాలన్న అభ్యర్థనలను తిరస్కరిస్తున్నాం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే, వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజారిటీలో ఉండాలని, కేంద్ర వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్‌లో ఉండే 20 మంది సభ్యుల్లో ముస్లిమేతరుల సంఖ్య నాలుగుకు మించరాదని చెప్పింది.
ఇక రాష్ట్రాల బోర్డుల్లో మొత్తం 11 మంది సభ్యుల్లో ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండరాదని తేల్చిచెప్పింది. వక్ఫ్ బోర్డుకు ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సీఈవో) నియామకం, ఇతర సర్వీసు నిబంధనలు నిర్ణయించడానికి సంబంధించిన సెక్షన్ 23పై మాత్రం స్టే విధించలేదు. కానీ, బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండడం మంచిదని తెలిపింది. అలాగే వివాదాస్పద ఆస్తిపై సంబంధిత అధికారి (కలెక్టర్) నివేదిక ఇచ్చేదాకా దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనపైనా స్టే విధించింది. ఆస్తి ప్రభుత్వానిదిగా సంబంధిత అధికారి పేర్కొంటే, దానికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న నిబంధనను కూడా నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో దాదాపు 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తులను లాగేసుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్రం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను రక్షించడానికే చట్టాన్ని సవరించామని వాదించింది. స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతం తాము జారీ చేసిన ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులని స్పష్టం చేసింది. చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదనల సందర్భంగా పిటిషనర్లు, కేంద్రం పూర్తిస్థాయిలో తమ వాణిని వినిపించకుండా ఇవి అడ్డుకోజాలవని తెలిపింది.
రాజ్యాంగ విలువలకు విజయం:విపక్షాలు
వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతిపక్షాలు స్వాగతించాయి. న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలకు లభించిన విజయంగా దీనిని అభివర్ణించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మన దేశం దీర్ఘకాలం కిందటే పరిష్కరించుకున్న సమస్యలను తిరగదోడటానికి, మతపరమైన విద్వేషాగ్నిని రగిలించటానికి, ప్రజల మధ్య చీలికలు తీసుకురావటానికి బీజేపీ ఈ చట్టం తీసుకొచ్చింది’ అని దుయ్యబట్టారు. వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘంలో సభ్యుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేశంలోని మైనారిటీ ప్రజల హక్కులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను సుప్రీంకోర్టు తన ఆదేశాల ద్వారా పునరుద్ఘాటించిందన్నారు. ధర్మాసనం ప్రస్తుతం స్టే విధించిన 3 క్లాజులను కాంగ్రె్‌సపార్టీ తొలి నుంచీ వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. ఏ సంస్కరణ అయినా రాజ్యాంగానికి విధేయంగా ఉండాలని, సంప్రదింపులకు అవకాశం కల్పించాలని, పారదర్శకంగా ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరని, సుప్రీంకోర్టు ఆదేశాలు దీనినే ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంలోని వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించటాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్టేపై ప్రముఖ ఇస్లామిక్ సంస్థ ‘జమైత్ ఉలేమా ఎ హింద్’ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ స్పందిస్తూ.. ‘దేశంలోని ప్రతీ పౌరుడికీ సమానమైన హక్కులను, మతస్వేచ్ఛను ఇచ్చిన రాజ్యాంగం మీద వక్ఫ్ చట్టం ఒక ప్రత్యక్ష దాడి వంటిది. ముస్లింల మతస్వేచ్ఛను లాక్కొనే కుట్రలో భాగంగానే ఈ ప్రమాదకరమైన చట్టం తెచ్చారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల విధించటం ద్వారా మాకు న్యాయం బతికే ఉందన్న నమ్మకం కలిగింది. మొత్తంగా చట్టాన్నే కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నాం’ అన్నారు.
ప్రజాస్వామ్యానికి శుభసంకేతం: రిజిజు
సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి శుభ సంకేతమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు పేర్కొన్నారు. పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చల తర్వాతే వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చామని, దాంట్లోని పలు అంశాలు యావత్ ముస్లిం సమాజానికి, ముఖ్యంగా పేద ముస్లిం సోదరులు, మహిళలకు ఉపయోగపడేవన్నారు. వక్ఫ్‌బోర్డు ద్వారా ఆస్తుల దురాక్రమణ వంటి వాటికి కూడా ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఈ విషయమంతా సుప్రీంకోర్టుకు తెలుసన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News