Supreme Court: ఉచితం.. అనుచితం!
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:17 AM
దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్న ‘ఉచిత’ పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని..

పథకాలతో పరాన్నజీవులను సృష్టిస్తున్నామా?
ఏ పనీ చేయకుండానే రేషన్, డబ్బులు
దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు
మహారాష్ట్రలో ఎన్నికలముందు పథకాలతో
రైతులకు కూలీలు దొరకడంలేదు
నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి
దేశాభివృద్ధికి వారూ తోడ్పడేలా చేయాలి
సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
‘‘నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలో భాగం కానివ్వాలి. వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి. కానీ... దీనికి బదులు ఇన్నిన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు! ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించడం లేదంటారా? ఎన్నికలకు ముందు ప్రకటించే లాడ్లీ బెహన్ తదితర ఉచిత పథకాల వల్ల... ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఎలాంటి పనీ చేయకుండానే వారికి ఉచిత రేషన్, డబ్బులు అందుతున్నాయి’’
- సుప్రీం కోర్టు
నేనూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించి అమలు చేయడంవల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికీ ఇంటి వద్ద ఉచితంగా రేషన్, డబ్బులు వస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు?
-జస్టిస్ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్న ‘ఉచిత’ పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని.. ఉచిత పథకాల మూలంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా మనం పరాన్నజీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా? అని ప్రశ్నించింది. ఢిల్లీలో ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసి్‌హతో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు మహారాష్ట్రవంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైనే ఆధారపడుతున్నారని, పనిచేయడానికి ఇష్టపడడం లేదని.. పనిచేయకుండా ఉచిత రేషన్ పొందుతున్నారని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా.. ‘‘పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరనుకుంటారు? చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరక్కపోవడం వల్లనే కదా?’’ అని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ‘‘మీకు ఒక కోణం మాత్రమే తెలిసినట్లున్నది. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికీ ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు?’’ అని ప్రశ్నించారు. ఏదేమైనా ఈ అంశంపై తాము చర్చలోకి వెళ్లాలని భావించట్లేదని పేర్కొన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సహా అందరూ అంటారని పేర్కొన్న ధర్మాసనం.. అదే సమయంలో (ఉచితాలకు, పని కల్పించడానికి మధ్య) సమతౌల్యం పాటించాల్సిన అవసరం లేదా అని అభిప్రాయపడింది. ఢిల్లీలో ప్రస్తుత షెల్టర్లలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు.. ‘‘రోడ్డుపై పడుకోవ డం, నివాసయోగ్యం కాని షెల్టర్ హోమ్‌లో ఉండడం.. ఈ రెండింటిలో ఏది మెరుగు?’’ అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
సమాచారాన్ని సేకరిస్తున్నాం..
పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం ‘పట్టణ పేదరిక నిర్మూలన’ పథకాన్ని ఖరారు చేస్తోందని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వెల్లడించారు. అది ఎప్పటిలోగా పూర్తవుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించగా.. రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాగా.. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయుల సంఖ్య పెరగడానికి మూలకారణాలపై ఎవరూ దృష్టిసారించకపోవడం దురదృష్టకరమని విచారణ సందర్భంగా ఒక పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోందని, పేదలను విస్మరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి జస్టిస్ గవాయ్... కోర్టులో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. కోర్టు గదులను రాజకీయ పోరుకు వేదిక కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోందని మీరెలా చెప్పగలరు?’’ అని సదరు పిటిషనర్‌ను నిలదీశారు.
ఆ లెక్కలు సరైనవేనా?
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2024 డిసెంబరు 4 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు మంజూరు చేసిన 2557 షెల్టర్లకుగాను.. 1995 షెల్టర్లు పనిచేస్తున్నాయని, వాటిలో 1.16 లక్షల పడకలున్నాయని ధర్మాసనానికి అటార్నీ జనరల్ వివరించారు. దీనికి ప్రశాంత్ భూషణ్.. ఒక్క ఢిల్లీలోనే 3 లక్షల మందికిపైగా నిరాశ్రయులు ఉన్నట్టు ఒక సర్వేలో వెల్లడైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ, ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు గణాంకాల ప్రకారమే ఢిల్లీలోని షెల్టర్ల సామర్థ్యం 17 వేలు (అంతమంది తలదాచుకునేటన్ని షెల్టర్లు) అని.. వాటిలోనూ కేవలం 5,900 పడకలు మాత్రమే ఉన్నాయని.. సమస్య ఎంత పెద్దదో ఈ అంకెలే చెబుతున్నాయని ఆయన వివరించారు. కాగా.. పిటిషనర్లలో ఒకరైన ఈఆర్ కుమార్.. రాష్ట్రాలవారీగా నిరాశ్రయుల సంఖ్య, షెల్టర్లు, వాటి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. దీనికి ధర్మాసనం.. ఆ అంకెలు సరైనవో కావో సంబంధి మంత్రిత్వ శాఖను అడిగి చెప్పాల్సిందిగా అటార్నీ జనరల్‌ను ఆదేశించి, కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.