Supreme Court Questions: గవర్నర్లు బిల్లుల్ని తొక్కిపెట్టొచ్చంటే..ద్రవ్యబిల్లునూ ఆపేయొచ్చుగా
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:59 AM
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులను తిప్పి పంపకుండా, ఆమోదం తెలపకుండా తొక్కిపట్టడం ద్వారా గవర్నర్లు వాటిని వీటో చేయగలరంటే.. ద్రవ్యబిల్లులను...
అలాంటి పరిస్థితి సమస్యాత్మకం: సుప్రీంకోర్టు
శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు గవర్నర్ సూచనలకు భిన్నంగా ఉంటే నిలిపేయొచ్చు
సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వెల్లడి
రాజ్యాంగం ప్రకారం బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఉంది
సుప్రీంకోర్టులో బీజేపీ పాలిత రాష్ట్రాల వాదన
రేపు తమిళనాడు, కేరళ ప్రభుత్వాల వాదనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులను తిప్పి పంపకుండా, ఆమోదం తెలపకుండా తొక్కిపట్టడం ద్వారా గవర్నర్లు వాటిని వీటో చేయగలరంటే.. ద్రవ్యబిల్లులను సైతం అలాగే ఆపే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. అలాంటి పరిస్థితే వస్తే అది సమస్యాత్మకమని వ్యాఖ్యానించింది. అయితే.. బిల్లులకు ఆమోదం విషయంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి ఉన్న స్వతంత్ర అధికారాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి. చట్టాలకు కోర్టులు ఆమోదం ఇవ్వలేవని.. ప్రతి వ్యాధికీ కోర్టు ఔషధం కాజాలదని వాదించాయి. బిల్లులకు ఆమోదం ఇవ్వగల అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే ఉందని.. అంతే తప్ప ‘ఆమోదం ఇచ్చినట్టుగా పరిగణించడం’ అనే పద్ధతే రాజ్యాంగంలో లేదని మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే స్పష్టం చేశారు. ‘‘బిల్లులకు ఆమోదం తెలపాలంటూ కోర్టులు రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయలేవు. ఒక చట్టానికి కోర్టు ఆమోదం ఇవ్వలేదు. ఆ అధికారం గవర్నర్లకు లేదా రాష్ట్రపతికి మాత్రమే ఉంది’’ అని తేల్చిచెప్పారు. బిల్లులను నిలిపివేయడం అనేది గవర్నర్‌కు ఉన్న నాలుగో ప్రత్యామ్నాయమని (మిగతా మూడూ.. ఆమోదం తెలపడం, శాసనసభకు తిప్పిపంపడం, రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం) వివరించారు. బిల్లులకు ఆమోదం ఇవ్వకుండా నిలిపివేసేందుకు గవర్నర్లకు ఉన్న అధికారాన్ని రాజ్యాంగం గుర్తించిందని.. దాన్ని వీటోగా పేర్కొనడం తప్పుదోవ పట్టించడమేనని అభ్యంతరం తెలిపారు. రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంపై న్యాయస్థానాలు రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించగలవా అనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం.. 14 సందేహాలతో సుప్రీంకోర్టుకు లేఖ (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) రాసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహన్, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం గవర్నర్లకు ఒక బిల్లును శాసనసభకుతిప్పిపంపకుండా తొక్కిపట్టే స్వతంత్ర అధికారం ఉందని అర్థం చేసుకోవడం పట్ల ఆందోళన వెలిబుచ్చింది. దీన్ని ఆమోదిస్తేగనక.. గవర్నర్లు ద్రవ్యబిల్లులకు సైతం ఆమోదం తెలపకుండా నిలిపివేయగలరన్న అర్థం వస్తుందని.. అలాంటి పరిస్థితే వస్తే అది చాలా సమస్యాత్మకమని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘గవర్నర్‌కు ఒక బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపివేసే అధికారం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలా (బిల్లుల్ని) తొక్కిపట్టే అధికారాన్ని గవర్నర్లు స్వతంత్రంగా అమలు చేయడం మొదలుపెడితే అది సమస్యగా మారుతుంది. ఎందుకంటే.. ఈ అధికారంతో గవర్నర్లు ద్రవ్యబిల్లుతో సహా ఏ బిల్లునైనా తమ వద్దకు రాగానే నిలిపివేయగలరు’’ అని జస్టిస్ పీఎస్ నరసింహన్ ఆందోళన వెలిబుచ్చారు.
ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు..
గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లు ద్రవ్యబిల్లు కానప్పుడు మాత్రమే దాన్ని శాసనసభ పునఃపరిశీలనకు తిప్పి పంపగలరు కదా? మరి ఆర్టికల్ 200లోని ప్రధాన నిబంధన ప్రకారం ద్రవ్య బిల్లును సైతం గవర్నర్ తిరస్కరించవచ్చనే విషయాన్ని మీరెలా సమన్వయం చేస్తారని జస్టిస్ నరసింహన్ ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగంలోని 207వ అధికరణలో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జవాబిచ్చారు. గవర్నర్ సూచనతోనే (సిఫారసు) ద్రవ్యబిల్లును సభలో ప్రవేశపెడతారు కాబట్టి.. గవర్నర్ ద్రవ్యబిల్లును నిలిపివేయడమనే సమస్యే ఉత్పన్నం కాదని వివరణ ఇచ్చారు. హరీశ్ సాల్వే జోక్యం చేసుకుని.. సభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సూచించినదానికి భిన్నంగా ఉంటే గవర్నర్ దానికి ఆమోదాన్ని నిలిపివేసే సందర్భం తలెత్తవచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలే గవర్నర్ల అధికారాలపై ఎలాంటి పరిమితులూ విధించనప్పుడు.. అటువంటి పరిమితులను వ్యాఖ్యానాల (ఇంటర్‌ప్రెటేషన్) ద్వారా విధించలేమని, బిల్లులపై రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితి విధించడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ ఒక బిల్లును ఎందుకు తొక్కిపట్టారో సమీక్షించే అధికారం కోర్టుకు లేదని ఆయన వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. ‘‘గవర్నర్ ఏదైనా బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపివేస్తే.. అలా ఎందుకు చేశారని కోర్టు అడగగలదా?’’ అని ప్రశ్నించగా.. ‘‘అడగలేదు’’ అని సాల్వే తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి/గవర్నర్లు తమ అధికారాలు, బాధ్యతలను నిర్వహించేక్రమంలో తీసుకున్న చర్యల గురించి ఏ కోర్టుకూ జవాబుదారీ కారని చెప్పారు. ‘‘మీ నిర్ణయం ఏమిటి?’’ అని మాత్రమే కోర్టులు వారిని అడగగలవుగానీ.. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించలేవని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగంలో లేదు..
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఉత్తరప్రదేశ్, ఒడిసా తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్.. రాష్ట్రపతి, గవర్నర్లకు కార్యనిర్వహణలో స్వతంత్రత ఉందని.. బిల్లులకు ఆమోదం ఇచ్చే విషయంలో వారికి సంపూర్ణ వివేచనాధికారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో కోర్టులు వారికి ఎలాంటి గడువూ నిర్దేశించలేవని తెలిపారు. గోవా సర్కారు తరఫున వాదనలు వినిపించిన ఏఎస్జీ విక్రమ్‌జిత్ బెనర్జీ కూడా.. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఆమో దం లేనిదే బిల్లు చట్టరూపం దాల్చే ప్రక్రియ సంపూర్ణం కాదని.. కాబట్టి, ‘ఆమోదం ఇచ్చినట్టుగా పరిగణించడం’ అనే భావనకు అవకాశమే లేదని వాదించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News