Supreme Court Questions EC: ఎస్‌ఐఆర్‌పై సుప్రీం విచారణ
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:08 AM
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ...
చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర
న్యూఢిల్లీ, ఆగస్టు 12: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఐఆర్ రూపకల్పనలో అవకతవకలు జరిగినట్లు తేలితే బిహార్ ఓటర్ల జాబితాను పక్కనపెట్టేస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబరు 30లోపు తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అయితే జాబితా తయారీలో అవకతవకలు జరిగినట్లు రుజువైతే దాన్ని ఆమోదించబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? గతంలో నమోదైన మరణాల సంఖ్య; ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య.. వంటి సమాచారంపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. పిటిషనర్లు, ఈసీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. పలు వ్యాఖ్యలు చేసింది. 2003 ఓటర్ల జాబితా ప్రకారం బిహార్‌లో ఉన్న 7.9 కోట్ల మంది ఓటర్లలో 6.5 కోట్ల మంది వారు, వారి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ‘విశ్వాస లోటు అంశం’మే తప్ప మరోటి కాదని పేర్కొంది. ‘‘7.9 కోట్ల మంది ఓటర్లలో 7.24 కోట్ల మంది ఎస్‌ఐఆర్‌పై స్పందించారు. ఈ నేపథ్యలో కోటి మంది ఓటర్లు గల్లంతయ్యారు లేదా తొలగించారన్న సిద్ధాంతానికి తావెక్కడిది?’’ అని పిటిషనర్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తరఫున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఆధార్ కార్డు, ఓటరు కార్డులు పౌరసత్వానికి సమగ్ర గుర్తింపులు కావన్న ఈసీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలో మరికొన్ని ఇతర పత్రాలు అవసరమని స్పష్టం చేసింది. కాగా, ఓటర్ల జాబితా రూపకల్పనలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేదీ చెప్పారు. ఇలాంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని, ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని పేర్కొన్నారు.
ఆ ఇద్దరినీ తీసుకొచ్చిన యోగేంద్ర..!
మరో పిటిషనర్ యోగేంద్ర యాదవ్ స్వయంగా వాదనలు వినిపించారు. ఎస్‌ఐఆర్‌లో చనిపోయినట్లుగా ప్రకటించిన ఇద్దరిని సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేదీ స్పందిస్తూ.. దీన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు. ఈ అంశంపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. ‘‘ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అయ్యి ఉంటుంది. దీన్ని సరిచేయవచ్చు. కానీ, మీరు లేవనెత్తిన అంశాలు బాగున్నాయి’’ అని యాదవ్‌ను ప్రశంసించారు. కాగా, ఓటర్ల జాబితా సవరణలో ఒక్క వ్యక్తిని కూడా చేర్చలేదని, ఇలాంటి ప్రక్రియ (ఎస్‌ఐఆర్) దేశ చరిత్రలోనే తొలిసారి అని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. అలాగే 65 లక్షల పేర్లను తొలగించారని, ఈ సంఖ్య కోటి కూడా దాటొచ్చని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి వాదనలు బుధవారం కొనసాగుతాయని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News