Share News

Supreme Court: పహల్గాం దాడి విచారణ పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 01 , 2025 | 02:48 PM

పహల్గాం ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిని, న్యాయవాదిని..

Supreme Court: పహల్గాం దాడి విచారణ పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court on Pahalgam

Supreme Court on Pahalgam Terror Attack Probe: పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సాయుధ దళాలను నిరాశపరిచే చర్యలు మానుకోవాలని హెచ్చరించింది. "ఈ దేశంలోని ప్రతి పౌరుడు ఉగ్రవాదంపై పోరాడటానికి చేతులు కలిపిన కీలకమైన సమయం ఇది" అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

"బాధ్యత వహించండి. మీరు దేశం పట్ల కొంత బాధ్యతతో మెలగాలి. ఇదేనా మార్గం.. దయచేసి ఇలా చేయకండి. పదవీ విరమణ చేసిన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎప్పటి నుండి ఇటువంటి అంశాలను (ఉగ్రవాదం) దర్యాప్తు చేయడానికి నిపుణుడిగా మారారు? మేము దేనినీ అంగీకరించడం లేదు. దయచేసి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లండి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ ఫతేష్ కుమార్ సాహు వ్యక్తిగతంగా పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. పహల్గాం ఘటనకు సంబంధించి రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలంటూ పిటిషనర్లు దాఖలు చేసిన పిల్ పై సుప్రీం పై ఘాటుగా స్పందించింది.

ఇలా ఉండగా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన ముగ్గురు నివాసితులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఉగ్రవాద దాడిపై జవాబుదారీతనం నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పిటిషనర్లు ఫతేష్ కుమార్ షాహు, మొహమ్మద్ జునైద్, విక్కీ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలలో పౌరుల భద్రతను నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రం, జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లను ఆదేశించాలని వారు తమ పిటిషన్లో కోరారు. అయితే, సుప్రీం కోర్టు దీనిని కొట్టిపారేయడమే కాకుండా పిటిషనర్లకు, వాళ్ల తరపు న్యాయవాదికి చురకలంటించింది.

కాగా, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలోని బైసరన్ అనే గడ్డి మైదానంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. "మినీ స్విట్జర్లాండ్" అని కూడా పిలువబడే ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి, కాలినడకన లేదా పోనీ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.


ఇవి కూడా చదవండి

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 02:58 PM