CM Mk Stalin: ప్రకటనల్లో సీఎం ఫొటో తప్పేంకాదు
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:42 AM
ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనల్లో ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టడం సర్వసాధారణమేనని..
మీ రాజకీయాలకు కోర్టులను వాడొద్దు
అన్నాడీఎంకే ఎంపీపై సుప్రీం సీరియస్
10 లక్షల జరిమానా విధించిన ధర్మాసనం
మద్రాస్ హైకోర్టు ఆదేశాలు కొట్టివేత
చెన్నై, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనల్లో ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టడం సర్వసాధారణమేనని.. అవేమీ తప్పుకాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సీఎంల పేర్లు, ఫొటోలను కూడా దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారని తెలిపింది. అదేసమయంలో, రాజకీయ కారణాలతో ఇలాంటి వాటిపై కోర్టును ఆశ్రయించి.. న్యాయస్థానాల వేదికగా యుద్ధాలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ‘ఉంగలుడన్ స్టాలిన్’(మీతో స్టాలిన్) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రచార పత్రాలు, బ్యానర్లలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఫొటోలను ముద్రించారు. దీనిని తప్పుబడుతూ ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాల ప్రచారం కోసం..సీఎం, మాజీ సీఎంలు, మృతి చెందిన నేతల పేర్లను వినియోగించడాన్ని తప్పుబడుతూ.. గత నెల 31న ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎంపీ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలకు సీఎం పేరు పెట్టిన దాఖలాలు లేవా? అని ప్రశ్నించింది. రాజకీయ స్పర్థలు ఎన్నికల వరకే ఉండాలని, అవి న్యాయస్థానాల దాకా రాకూడదని కటువుగా వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశంతోనే పిటిషనర్ న్యాయస్థానానికి వచ్చినట్లుందని వ్యాఖ్యానిస్తూ.. ఆయనకు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
Read Latest Telangana News and National News