Bill Approval: కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా?
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:03 AM
అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమైపోతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టంచేశారు.
గవర్నర్లు బిల్లుల్ని నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి
రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేం జోక్యం చేస్కోవద్దా?
సొలిసిటర్ జనరల్‌ను నిలదీసిన సీజేఐ
బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు: ఎస్‌జీ
అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని సీజేఐ స్పష్టీకరణ
తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 21: అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమైపోతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టంచేశారు. ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు ఉండదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ విధులు నిర్వర్తించకపోతే న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కేంద్రం తరఫు సీనియర్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను నిలదీశారు. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట కాలవ్యవధిని సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కూడా తన విచారణ కొనసాగించింది. రాష్ట్రపతి, గవర్నర్ తప్పనిసరిగా తన ఉత్తర్వు లు పాటించేలా న్యాయవ్యవస్థ ఆదేశాలు ఇవ్వజాలదని మెహతా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొంద రు గవర్నర్లు బిల్లులను నిలిపివేస్తే.. రాష్ట్రప్రభుత్వా లు కోర్టులకు రావడం కాకుండా రాజకీయ పరిష్కారాలు కనుక్కోవాలని సూచించారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ఎక్కడైనా తప్పు జరిగితే దిద్దుబాటు ఉండి తీరాలన్నారు. ‘రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అకారణంగా తమ విధులు నిర్వహించకపోతే.. కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా’ అని మెహతాను ప్రశ్నించారు. ఆయన జవాబిస్తూ.. అన్ని సమస్యలకూ కోర్టులే పరిష్కారం కాదని.. ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గవర్నర్ నిష్ర్కియగా వ్యవహరిస్తే.. బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే.. ఆ నిష్ర్కియాపరత్వంపై న్యాయసమీక్ష జరపకుండా సంపూర్ణంగా నిషేధించాలా అని జస్టిస్ సూర్యకాంత్ అడిగారు. అయితే ఈ వ్యవహారంలో కొన్ని వెసులుబాట్లు అవసరమని మెహతా అభిప్రాయపడ్డారు. ‘గవర్నర్ బిల్లులు నిలిపివేస్తే ప్రతి చోటా ముఖ్యమంత్రి కోర్టుల వద్దకు పరుగెత్తడం లేదు. చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయు.
సీఎం వెళ్లి గవర్నర్‌ను కలవడం.. ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలిసి పరిష్కారాలు కనుక్కోవచ్చు, వారి నడుమ ఫోన్ సంభాషణలు జరిగిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. వివాదాల పరిష్కారానికి దశాబ్దాలుగా ఈ సంప్రదాయం నడుస్తోంది. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి బృందాలు గవర్నర్‌ను, రాష్ట్రపతిని కలవొచ్చు. మధ్యేమార్గాన్ని కూడా కనుక్కోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్, రాష్ట్రప్రభుత్వం మధ్య సంక్షోభ పరిష్కారానికి రాజనీతిజ్ఞత, రాజకీయ పరిపక్వత చూపాల్సిన అవసరం ఉంది. ప్రతి సమస్యకు కోర్టులో పరిష్కారాలు ఉండకపోవచ్చు. ఎక్కువ సమస్యలకు వ్యవస్థలోనే పరిష్కారాలు దొరుకుతాయి. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో ఎక్కడా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించలేదు’ అని మెహతా తెలిపారు. సీజేఐ స్పందిస్తూ.. తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని.. సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకురాలని.. వాస్తవ అర్థం ఇవ్వడం ద్వారా రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆయనతో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఏకీభవించారు. మెహతా స్పందిస్తూ.. న్యాయబద్ధత వేరు.. రాజ్యాంగానికి ఇతరమేదైనా జోడించడం వేరని తెలిపారు. ‘ఇదే న్యాయస్థానం తన తీర్పుల్లో ప్రస్తావించకుండా.. నిర్దిష్ట విధి నిర్వహించాల్సిందిగా సొలిసిటర్ జనరల్‌ను పలుసార్లు ఆదేశించిన సందర్బాలున్నాయి. అలాగే.. ఫలానా గడువులోగా గవర్నర్ బిల్లులను ఆమోదించేలా చట్టం చేయాలని కోర్టు పార్లమెంటు ను నిస్సందేహంగా కోరవచ్చు. కానీ తీర్పు ద్వారా కాలవ్యవధిని నిర్ణయించరాదు’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి కారణమైన తీర్పును మెహతా ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం.. బిల్లుకు ఆమోదాన్ని నిలిపివేయడం గవర్నర్ స్వతంత్ర అధికారమని.. ఇది పరిపూర్ణ విధి కూడా అని తెలిపారు. అయితే గవర్నర్ ప్రజలకు జవాబుదారీ కాదని, ఆయన్ను ఏ కారణం లేకుండానే తొలగించవచ్చని సీజేఐ గుర్తుచేశారు.
న్యాయవ్యవస్థ క్రియాశీలత.. న్యాయ ఉగ్రవాదం కారాదు: సీజేఐ
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత.. జ్యుడీషియల్ ఉగ్రవాదం కారాదని స్పష్టంచేశారు. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చాలా అనుభవజ్ఞులని.. వారిని తక్కువ చేయడానికి వీల్లేదని సొలిసిటర్ జనరల్ అన్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికైనవారి గురించి మేమెప్పుడూ ఏమీ అనలేదు. న్యాయవ్యవస్థ క్రియాశీలత.. జ్యుడీషియల్ ఉగ్రవాదం లేదా సాహసకృత్యంగా మారకూడదని నేనెప్పుడూ చెబుతాను’ అని స్పష్టంచేశారు. రాజ్యాంగ ధర్మాసనం తదుపరి విచారణ 26వ తేదీన జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి