Share News

Supreme Court: 498.. వరకట్నం సెక్షన్‌ మాత్రమే కాదు!

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:26 AM

భర్తలపై క్రూరత్వ అభియోగాలు మోపడానికి ‘వరకట్నం డిమాండ్‌’ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద వరకట్నం డిమాండ్‌ చేయడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Supreme Court: 498.. వరకట్నం సెక్షన్‌ మాత్రమే కాదు!

అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుంది

భర్తపై క్రూరత్వ అభియోగాల

నమోదుకు కట్నం డిమాండ్‌ను

ప్రత్యేకంగా చేర్చక్కర్లేదు

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భర్త, అత్తింటివారి నుంచి వివాహితలకు రక్షణ ఛత్రంగా తీసుకువచ్చిన ఐపీసీ ‘సెక్షన్‌ 498’లో అన్ని రకాల వేధింపులను ఇమిడ్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తలపై క్రూరత్వ అభియోగాలు మోపడానికి ‘వరకట్నం డిమాండ్‌’ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద వరకట్నం డిమాండ్‌ చేయడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబరు 12న వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్‌ 498ఏలోనే క్రూరత్వ చర్యలు ఇమిడి ఉన్నాయని, భర్త, అత్తమామలపై ఈ సెక్షన్‌ను అమలు చేయడానికి అదనంగా వరకట్నం డిమాండ్‌ను జోడించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. భార్యలపై జరిగే క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది 498 సెక్షన్‌ కింద శిక్షార్హమైందేనని పేర్కొంది. సెక్షన్‌ 498ఏ, బీ క్లాజులలో అంశాలు ఎలాంటి వేధింపులకైనా వర్తిస్తాయని స్పష్టం చేసింది. క్లాజ్‌-ఏ ప్రకారం.. భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడం, క్లాజ్‌-బీ ప్రకారం.. భార్య లేదా ఆమె పుట్టింటి వారి నుంచి చట్టవిరుద్ధమైన డిమాండ్‌ను(అదనపు కట్నం, కానుకలు వంటివి) బలవంతంగా నెరవేర్చుకునేందుకు చేసే వేధింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 498ను ప్రవేశ పెట్టిన సందర్భంగా పార్లమెంటులో చేసిన ప్రకటనను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.


‘‘ఈ నిబంధన.. కేవలం వరకట్న వేధింపులు, వరకట్న మరణాలకే కాదు, వివాహితలపై వారి భర్తలు, అత్తింటివారు క్రూరంగా ప్రవర్తించే కేసులను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తుంది’’ అని పార్లమెంటులో చేసిన ప్రకటనను ధర్మాసనం చదివి వినిపించింది. ‘సెక్షన్‌ 498ఏ’ కింద ఒక వ్యక్తి సహా ఇతరులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. అయితే, ఈ కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. సదరు వ్యక్తి, ఇతరులపై నమోదైన అభియోగాలు సెక్షన్‌ 498ఏలో పేర్కొన్న క్రూరత్వం కిందకు రాబోవని, వారు వరకట్నం డిమాండ్‌ చేసినట్టు స్పష్టం కాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. అనంతరం, ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పలు తీర్పులను ఉటంకిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును(ఎ్‌ఫఐఆర్‌ కొట్టివేత) తోసిపుచ్చింది. ఈ కేసులో సదరు వ్యక్తి భార్య అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది.


ఇవి కూడా చదవండి..

మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 04:26 AM