Share News

Sunjay Kapur's Property Dispute: సంజయ్ కపూర్ ఆస్తుల కోసం రగడ.. కోర్టులో తీవ్ర వాదోపవాదాలు

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:46 PM

దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం ఆయన సంతానం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఢిల్లీ హైకోర్టులో సంజయ్ భార్య ప్రియ, ఇతర పిటిషనర్ల లాయర్ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.

Sunjay Kapur's Property Dispute: సంజయ్ కపూర్ ఆస్తుల కోసం రగడ.. కోర్టులో తీవ్ర వాదోపవాదాలు
Sunjay Kapur will dispute

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు.. తమ తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌కు చెందిన రూ.30 వేల కోట్ల ఆస్తిలో వాటాలు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాటకీయ స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. కరిష్మ కపూర్ ఇద్దరు పిల్లలతో పాటు వారి నాన్నమ్మ, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్‌, ఆయన భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్‌ విచారణకు హాజరయ్యారు. సంజయ్ తన ఆస్తి మొత్తాన్ని తన భార్య ప్రియ పేరిట రాసిన విల్లును వారు సవాలు చేశారు. కరిష్మ పిల్లల తరపున సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. సంజీవ్ భార్య ప్రియ తరపున సీనియర్ లాయర్లు రాజీవ్ నాయర్, షేయల్ ట్రీహాన్ తమ వాదనలు వినిపించారు (Sunjay Kapur will dispute).

ప్రియ గానీ, తమ తండ్రి సంజయ్ గానీ విల్లు గురించి తమ ముందు అంతకుముందెప్పుడూ ప్రస్తావించలేదని పిల్లలిద్దరూ అన్నారు. తమ సవితి తల్లి ప్రియ వ్యవహార శైలి చూస్తుంటే ఆ విల్లు నకిలీదన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. ఈ వాదనలను ప్రియా కపూర్ తరపు లాయర్లు తోసి పుచ్చారు. సంజయ్ మరణానికి ముందే ఆ పిల్లలకు కపూర్ కుటుంబానికి చెందిన రాణీ కపూర్ ట్రస్టు నుంచి కొన్ని ఆస్తులు సంక్రమించాయని అన్నారు. ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ సోనా కామ్‌స్టర్‌లో ఈ ట్రస్టుకు వాటాలున్నాయి (Delhi High Court Hearing).


ప్రియ తరపు లాయర్లు వాదిస్తూ ఈ కేసులో ఏడుపులు పెడబొబ్బలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రియ సంజయ్ కపూర్ భార్య అని, ఇన్నాళ్లు కరిష్మా ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కరిష్మ, సంజయ్ విడాకుల వ్యవహారం అప్పట్లో రసాభాసగా మారిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తిలో తమకేమీ వాటా దక్కలేదని వారు గోల చేస్తున్నారని, వారేమీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డుమీదకు వచ్చేయలేదని కామెంట్ చేశారు. విల్లును రిజస్టర్ చేయనంత మాత్రాన చెల్లుబాటు కాకుండా పోదని అన్నారు. ‘మరణించిన వ్యక్తి విషయంలో కాస్త దయ చూపండి. నా బిడ్డకు ఆరేళ్లు. గత 15 ఏళ్లుగా కర్మిష్మా జాడ కూడా లేదు’ అని ప్రియ తన పిటిషన్‌లో పేర్కొన్నారు (Sunjay Kapur forged will).

ఇక సంజయ్ తల్లి రాణి కపూర్ కూడా తన వాదనలు వినిపించారు. ‘నేను తలదాచుకునేందుకు ఒక గూడు కూడా లేకుండా చేసి నా కొడుకు వెళ్లిపోయాడా? నాకు 80 ఏళ్లు. ఈ రోజు నాకంటూ ఏమీ మిగల్లేదు. విల్లు చూపించమని నేను ఇప్పటివరకూ 15కు పైగా ఈమెయిల్స్ పంపించా. ఒక్కదానికీ సమాధానం రాలేదు. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఆస్తిలో దాదాపు 10 వేల కోట్లు నాకు చెందాలి’ అని అన్నారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు ప్రియను ఈ విషయాలపై స్పందించాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్

కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్

For More National News and Telugu News

Updated Date - Sep 10 , 2025 | 05:58 PM