Gitanjali Angmo: ఆయన పాక్ వెళ్లింది అందుకే, పైగా మోదీని పొడిగారు... వాంగ్‌చుక్ భార్య వెల్లడి
ABN , Publish Date - Sep 28 , 2025 | 07:32 PM
వాంగ్‌చుక్ ఏళ్ల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్నారని, అయితే సీఆర్‌పీఎఫ్ చర్యలతోనే సెప్టెంబర్ 4న పరిస్థితి ఉద్రిక్తంగా మారి నలుగురి మృతికి దారితీసిందని ఆంగ్మో ఆరోపించారు.
లెహ్: లద్దాఖ్ (Ladakh)లోని లెహ్(Leh)లో జరిగిన హింసాకాండ (Violence)కు భద్రతా బలగాలే కారణమని ఘటన అనంతరం అరెస్టయిన పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ (Sonam Wangchuk) భార్య గీతాంజలి జె ఆంగ్మో (Gitanjali J Angmo) ఆరోపించారు. తన భర్తకు పాక్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తన సంస్థల ద్వారా ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారనే అభియోగాలను సైతం కొట్టివేశారు. తన భర్త గాంధేయవాది అని, ఆయన వల్ల ఎలాంటి హాని లేదని తెలిపారు.
వాంగ్‌చుక్ ఏళ్ల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్నారని, అయితే సీఆర్‌పీఎఫ్ చర్యలతోనే సెప్టెంబర్ 4న పరిస్థితి ఉద్రిక్తంగా మారి నలుగురి మృతికి దారితీసిందని ఆంగ్మో ఆరోపించారు. హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివి లెర్నింగ్ (HIAL) సహవ్యవస్థాపకురాలిగా ఆంగ్మో ఉన్నారు. లెహ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రెండ్రోజుల తర్వాత గత శుక్రవారం నాడు జాతీయ భద్రతా చట్టం (NSA)కింద వాంగ్‌చుక్‌ను నిర్బంధంలో తీసుకున్నారని, అయితే ఆ సమయంలో తనకు డిటెన్షన్ ఉత్తర్వులు చూపించలేదని, ఆ తర్వాతా ఆయనతో తాను మాట్లాడలేకపోయానని తెలిపారు.
వాతావరణంపై సమావేశం కోసం పాక్ వెళ్లాం
వాంగ్‌చుక్ 'డాన్' మీడియా గ్రూప్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారని, ఆయనకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నామని లద్దాక్ పోలీస్ చీఫ్ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ చేసిన ప్రకటనపై ఆంగ్మో స్పందించారు. పూర్తిగా వృత్తిరీత్యా, వాతావరణ అంశాలపై డిస్కషన్ కోసం వాంగ్‌చుక్ పాక్ వెళ్లారని, ఆయన జరిపిన పర్యటలన్నీ ప్రఖాత్య యూనివర్శిటీలు, సంస్థల ఆహ్వానం మేరకే జరిగినట్టు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ నిర్వహించిన కార్యక్రమానికి తాము హాజరయ్యామని, వాతావరణ మార్పుల్లో మహిళల పాత్ర అనే అంశంపై పేపర్ ప్రెజెంటేషన్ కోసం తాను కూడా వెళ్లానని చెప్పారు. 'నిజానికి, ఆ ఈవెంట్‌లో వేదికపై ప్రధానమంత్రి మోదీని ఆయన (వాంగ్‌చుక్) ప్రశంసించారు' అని ఆమె తెలిపారు.
'బ్రీత్ పాకిస్థాన్' సదస్సును యునైటెడ్ పాకిస్థాన్ ఛాప్టర్, డాన్ మీడియా నిర్వహించిందని, మల్టీనేషనల్ కోఆపరేషన్ కూడా ఉందని ఆంగ్మో తెలిపారు. ఐసీఐఎంఓడీ వంటి సంస్థలు ఎనిమిది హిమాలయ పర్యత ప్రాంత దేశాలను ఒకచోటకు తెచ్చి, వివిధ అంశాలపై పనిచేస్తోందని చెప్పారు. ఐసీఐఎంఓడీ హిమాలయన్ యూనివర్శిటీ కన్సార్టియంలో తాము భాగమని తెలిపారు.
చైనా గూడ్స్‌ను బహిష్కరించమన్నారు..
వాంగ్‌చుక్‌ను నెగిటివిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఆంగ్మో తప్పుపట్టారు. ఇండియన్ ఆర్మీకి షెల్టర్లు కల్పించాలని, చైనా వస్తువులను బహిష్కరించాలని మాట్లాడే వాంగ్‌చుక్‌ను జాతి వ్యతిరేకిగా ఎలా చిత్రీకరిస్తారని ఆమె ప్రశ్నించారు. కఠినమైన ఎన్ఎస్ఏ కింద వాంగ్‌చుక్‌పై కేసు పెట్టడాన్ని తప్పుపడుతూ, ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. శాంతిభద్రతలకు ఆయన ఎలాంటి ముప్పూకాదని చెప్పారు.
నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన 'జెన్ జడ్' నిరసనలను ప్రస్తావించడంపై మాట్లాడుతూ, అదొక ఉదాహరణగా మాత్రమే ఆయన చెప్పారని, ప్రభుత్వాలు స్పందించనప్పుడు అది తిరుగుబాటుకు దారితీస్తుందని ఆయన చెప్పడానికి వక్ర భాష్యాలు చెప్పడం సరికాదని అన్నారు. 'మార్పు అనేది ఒక వ్యక్తితోనే, ఒక వ్యక్తి మరణంతోనే జరుగుతుంటుంది. అందుకోసం సంతోషంగా నా జీవితాన్ని అర్పిస్తాను' అని వాంగ్‌చుక్ చెప్పడాన్ని వక్రీకరించరాదని కోరారు. లద్దాఖ్ ప్రజలకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వాంగ్‌చుక్ గుర్తు చేశారని తెలిపారు. లెహ్ అపెక్స్ బాడీ శాంతియుతంగానే నిరసనలు చేపట్టిందన్నారు. సెప్టెంబర్ 24న చోటుచేసుకున్న హింసాకాండపై అసహ్యం వేసే వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించుకున్నారని వివరించారు. ఆయనకు శాంతియుత నిరసనలే కానీ అహింసాయుత నిరసనల గురించి తెలయవని, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది టియర్‌గ్యాస్ ప్రయోగించడంతోనే యువత రాళ్లు రువ్విందని, దాంతో పరిస్థితి విషమించిందని అన్నారు. కాల్పులు జరిపే హక్కు సీఆర్‌పీఎఫ్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలను ఆంగ్మో తోసిపుచ్చారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం క్లియెరెన్స్ లేకుండా హెచ్ఐఏఎల్ విదేశాల నుంచి విరాళాలు తీసుకుందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
For More National News And Telugu News