Rahul Gandhi: ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, బలవంతపు అణచివేత
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:16 PM
ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో అలజడి రేపిందని, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని రాహుల్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్రమైన పని ఒత్తిళ్ల కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలపై ఘాటుగా స్పందించారు. ఎస్ఐఆర్‌ను బలవంతపు అణిచివేత (Imposed oppression)గా అభివర్ణించారు. ఈ ప్రక్రియ దేశ ప్రజలను వేధించేందుకు చేపట్టిన 'ఉద్దేశపూర్వక కుట్ర' అని ఆరోపించారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో అలజడి రేపిందని, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని రాహుల్ పేర్కొన్నారు. నిజమైన ఓటర్లను తప్పించడం ద్వారా ఎలక్టోరల్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం, ఓట్ల చోరీని అప్రతిహతంగా కొనసాగించం ఎస్ఐఆర్ లక్ష్యమని ఆరోపించారు. 'ఎస్ఐఆర్ పేరుతో పౌరులను వేధించేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగింది. విపరీతమైన ఒత్తిడి బీఎల్ఓల మృతికి కారణమవుతోంది' అని తప్పుపట్టారు.
ఫలితం ఏమిటంటే..
ఎస్ఐఆర్ ఒత్తిళ్ల కారణంగా మూడు వారాల్లో 16 మంది బీఎల్ఓలు ప్రాణాలు కోల్పోయారని, గుండెపోట్లు, ఒత్తిళ్లు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సంస్కరణ కాదని, బలవంతపు అణిచివేత అని అరోపించారు. ప్రపంచానికి కట్టింగ్-ఎడ్జ్ సాఫ్ట్‌వేర్‌ను దేశం సృష్టిస్తుంటే, ఎన్నికల కమిషన్ 'జంగిల్ ఆఫ్ పేపర్‌వర్క్'ను సృష్టిస్తోందని ఆక్షేపణ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఉద్దేశాలు మంచివైతే ఎన్నికల జాబితాను డిజిటల్ చేయాలని, సెర్చబుల్‌గా ఉండాలని, మెషీన్-రీడబుల్ సౌకర్యం ఉండాలని అన్నారు. 30 రోజుల్లో తూతూమంత్రంగా జాబితాలు తయారు చేయడానికి బదులు జవాబుదారీతనం, పారదర్శకత కోసం తగిన సమయం తీసుకుని ఉండాల్సిందని అన్నారు.
కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో పలువురు బూత్ లెవల్ అధికారుల మరణాలకు బీజేపీని తప్పుపట్టారు. పని ఒత్తిళ్ల కారణంగా బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హడావిడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్దనోట్ల రద్దు, కోవిడ్ 19 లాక్‌డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తోందని విమర్శించారు. బీజేపీ 'ఓట్ చోరీ' ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందన్నారు.
ఇవి కూడా చదవండి..
చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ
SIR కి వ్యతిరేకంగా గళం విప్పిన టీవీకే పార్టీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.