Share News

Ajit Pawar: నేనేమీ బెదిరించలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:32 PM

అభివృద్ధి అన్నదే తమ ప్రధాన ఎజెండా అని అజిత్ పవార్ చెప్పారు. అదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో చెప్పానని, పని చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలకు కాదని అన్నారు.

Ajit Pawar: నేనేమీ బెదిరించలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం
Ajit Pawar

ముంబై: 'మీ దగ్గర ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర నిధులు ఉన్నాయి' అంటూ మాలేగావ్‌లో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ఆదివారంనాడు వివరణ ఇచ్చారు. అదేమీ బెదిరింపు కాదని చెప్పారు. విమర్శకులు చాలా మాట్లాడుతుంటారని, అయితే వాటిని తాను పట్టించుకోనని, మాలేగావ్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.


మాలేగావ్ నగర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతి తహసిల్‌లో శుక్రవారంనాడు అజిత్ పవార్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌సీపీ నుంచి నిలబడుతున్న 18 మంది అభ్యర్థులను గెలిపించాలని, టౌన్ అభివృద్ధికి తనవద్ద ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ఓట్ల వేయకుంటే తన స్పందన కూడా అదే తీరులో ఉంటుందన్నారు. మహారాష్ట్రలోని బీజేపీ-ఎన్‌సీపీ-శివసేన ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఓటర్లను బెదరిస్తున్నారని, ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించాయి.


అభివృద్ధే మా ఎజెండా

తన వ్యాఖ్యలపై అజిత్ పవార్ స్పందిస్తూ, అభివృద్ధి అన్నదే తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అదే విషయాన్ని తాను చెప్పానని, పని చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలకు కాదని అన్నారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులను ఆయా ప్రాంతాల్లో కనీస అవసరాల తీర్చేందుకు తాము వెచ్చిస్తుంటామని చెప్పారు. తన వ్యాఖ్యలు 'బెదిరింపు' ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు అనేక మంది అనేక వాగ్దానాలు చేస్తుంటారని, బిహార్ ఎన్నికల్లో గెలిస్తే ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వాగ్దానం చేయలేదా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుందని, ఏ మేరకు వాటిని పరిగణనలోకి తీసుకోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 23 , 2025 | 06:35 PM