Share News

Shubanshu Shukla Returns: సురక్షితంగా భూమికి శుక్లా

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:11 AM

భారత కీర్తిపతాకను అంతరిక్షంలో సగర్వంగా ఎగురవేసిన వాయుసేన కెప్టెన్‌, వ్యోమగామి శుభాన్షు శుక్లా..

Shubanshu Shukla Returns: సురక్షితంగా భూమికి శుక్లా

18 రోజుల యాక్సియం-4 మిషన్‌ విజయవంతం

  • షెడ్యూల్‌ ప్రకారం పసిఫిక్‌ మహాసముద్రంలో దిగిన డ్రాగన్‌ క్యాప్సూల్‌.. నలుగురు వ్యోమగాములూ క్షేమం

  • మరో 7 రోజులు వారంతా పునరావాస కేంద్రంలోనే!

  • ఆనందంతో కంటతడి పెట్టిన శుభాన్షు తల్లిదండ్రులు

  • హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము

  • అంకితభావం, ధైర్యసాహసాలతో శుభాన్షు కోట్లాది మంది కలలకు స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 15: భారత కీర్తిపతాకను అంతరిక్షంలో సగర్వంగా ఎగురవేసిన వాయుసేన కెప్టెన్‌, వ్యోమగామి శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్‌) నుంచి క్షేమంగా భూమికి తిరిగొచ్చారు! యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోష్‌ ఉజ్‌నైన్‌స్కీ (పోలండ్‌), టిబోర్‌కాపు (హంగరీ)తో కలిసి జూన్‌ 26న ఐఎ్‌సఎ్‌సకు చేరుకున్న శుక్లా.. 18 రోజులపాటు అక్కడ పలు ప్రయోగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. ఆ నలుగురితో కూడిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ (దాని పేరు గ్రేస్‌) భారత కాలమానం ప్రకారం సోమవారం (జూలై 14న) సాయంత్రం 4.45 గంటలకు ఐఎ్‌సఎస్‌ నుంచి విడివడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే.. ఐఎ్‌సఎస్‌ చుట్టూ ఉండే 200 మీటర్ల ‘కీప్‌ అవుట్‌ స్పియర్‌’ను.. 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే అప్రోచ్‌ ఎలిప్సాయిడ్‌ను దాటేసి.. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి బాట పట్టింది. దాదాపు 22.5 గంటల ప్రయాణం తర్వాత.. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు (అమెరికా సమయం ప్రకారం తెల్లవారుజామున 2.31 గంటలకు) కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో తీరానికి సమీపాన పసిఫిక్‌ మహాసముద్రంలో దిగింది. 3.07 గంటలకు.. తాము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ క్యాప్సూల్‌ నుంచే రేడియో సందేశం పంపారు. అప్పటికే ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ రికవరీ నౌక ‘షానన్‌’ సిబ్బంది.. 3.10 గంటలకు పీపీఈ కిట్లు ధరించి చిన్నచిన్న పడవల్లో ఆ క్యాప్సూల్‌ వద్దకు వెళ్లి ప్రమాదకరమైన వాయువులు ఏవీ లేవని నిర్ధారించుకున్నారు. 3.15 గంటలకు దాన్ని నిదానంగా షానన్‌ నౌక వద్దకు తీసుకొచ్చారు.


3.30 గంటలకు.. తాళ్ల సహాయంతో క్యాప్సూల్‌ను నౌకలోకి తీసుకెళ్లారు. నిర్ణీత తనిఖీల అనంతరం.. 3.49 గంటలకు గ్రేస్‌ క్యాప్సూల్‌ నుంచి తొలుత మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ బయటకు వచ్చారు. 3.52 గంటలకు అందులోంచి శుక్లా బయటకొచ్చారు. తర్వాత మిగతా ఇద్దరూ వచ్చారు. ఇన్ని రోజులుగా రోదసిలో భార రహిత స్థితిలో ఉండడంతో.. వారు నడవడానికి ఇబ్బందిపడ్డారు. క్యాప్సూల్‌ నుంచి ర్యాంపు మీదుగా నౌకలోకి జారిన ఆ నలుగురినీ అక్కడున్న సిబ్బందే జాగ్రత్తగా పైకి లేపి, నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారు నలుగురూ నవ్వుతూ, చేతులు ఊపుతూ వెళ్లారు. అక్కడ ముందే సిద్ధంగా ఉన్న వైద్యులు.. రోదసి నుంచి తిరిగి వచ్చే వ్యోమగాములకు చేసే వైద్యపరీక్షలన్నీ వారికి చేశారు. అనంతరం వారిని హెలికాప్టర్‌లో తీరానికి తీసుకొచ్చారు. భూమ్మీద జీవనానికి అలవాటుపడడానికి వీలుగా వారం రోజులపాటు వారిని పునరావాస కేంద్రంలో ఉంచనున్నారు.


ఆనందబాష్పాలు..

డ్రాగన్‌ క్యాప్సూల్‌ రాకను లైవ్‌లో వీక్షించిన శుక్లా కుటుంబసభ్యులు.. అది సురక్షితంగా పసిఫిక్‌ మహాసముద్రంలో దిగగానే కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో శుభాన్షు తల్లి ఆశా శుక్లా, తండ్రి శంభు దయాళ్‌ శుక్లా, సోదరి శుచి మిశ్రా ఆనందంతో కంటతడి పెట్టారు. ‘‘మా అబ్బాయి క్షేమంగా తిరిగొచ్చాడు. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అని ఆశా గద్గద స్వరంతో చెప్పారు. డ్రాగన్‌ క్యాప్సూల్‌ తిరుగుప్రయాణం మొదలవగానే.. తాము ఆంజనేయస్వామి గుడికి వెళ్లామని, అక్కడ సుందరకాండ పారాయణ చేశామని ఆమె అంతకు ముందు మీడియాకు తెలిపారు. చరిత్రలో తనదంటూ ఒక పేరు లిఖించుకున్న తమ కుమారుణ్ని చూసి గర్విస్తున్నామని చెప్పారు. ఇక.. భూమ్మీదికి తిరిగొచ్చిన శుక్లా బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక స్వాగతం పలికారు. శుభాన్షు శుక్లా క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశప్రజలందరితో కలిసి తాను కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. శుక్లా తన అంకితభావం, ధైర్యసాహసాలతో కోట్లాదిమంది కలలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతదేశం తలపెట్టిన మానవ సహిత రోదసియాత్ర గగన్‌యాన్‌ దిశగా ఈ మిషన్‌ను కీలక మైలురాయిగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌ తదితరులు శుక్లా క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. ఇది దేశప్రజలందరికీ గర్వకారణమైన ఘట్టమని పేర్కొన్నారు. దేశ గౌరవాన్ని శుక్లా ఇనుమడింపజేశారని.. మన వ్యోమగాములు, శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారని అమిత్‌ షా ప్రశంసించారు. శుక్లా రోదసిలోకి వెళ్లడమే కాక.. భారతదేశ ఆకాంక్షలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారని రాజ్‌నాథ్‌ కొనియాడారు. ఇక.. ఈ మిషన్‌లో భాగంగా అనుకున్న ప్రణాళిక ప్రకారం శుభాన్షుశుక్లా ఐఎ్‌సఎ్‌సలో ఏడు ప్రయోగాలు నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 06:20 AM