Pahalgam Terror Attack: కాల్చేసి ప్రాణం పోయాకే వెళ్లారు
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:24 AM
పెహల్గాం లోయలో హిందువులపై ఉగ్రదాడిలో శైలేశ్ తన ప్రాణాలు కోల్పోగా, భార్య శీతల్ పిల్లలతో కలిసి భయంతో ప్రాణాల కోసం పరుగెత్తింది. ముష్కరులు హిందువులను వేరు చేసి లక్ష్యంగా చేసుకోవడమే కాక, సహాయక చర్యల్లో ఆలస్యం దుఃఖకరంగా నిలిచింది
హిందువులు, ముస్లింలను వేర్వేరుగా నిల్చోమన్నారు
ఉగ్రదాడిలో భర్త శైలేశ్‌ను కోల్పోయిన శీతల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భార్యాభర్తలు.. వారి ఇద్దరు పిల్లలు ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరున్న ఆ పెహల్గాంకు వచ్చి అప్పటికి కేవలం 15-20 నిమిషాలే అవుతోంది. దూరం నుంచి తుపాకీ చప్పుళ్ల మోత వినిపించింది.. అప్రమత్తయ్యేలోపు సాయుధులైన ఉగ్రవాదులు దగ్గరికొచ్చేశారు. దంపతుల్లో భర్తను కాల్చేశారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న అతడు చనిపోయేదాకా అక్కడే ఉన్నారు. ఇలా ముష్కరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న శైలేశ్ కాలతీయ గురించి ఆయన భార్య శీతల్ గుర్తుచేసుకున్నారు. ఉగ్రవాదులు వచ్చీరాగానే పురుషుల్లో హిందువులు, ముస్లింలు వేర్వేరు బృందాలుగా నిలబడాలంటూ చెప్పి.. రెండు, మూడు నిమిషాల్లో హిందువులను కాల్చిచంపారని శీతల్ చెప్పారు.
తూటాల గాయాలతో కుప్పకూలిన తన భర్త తలను ఒళ్లో పెట్టుకొని సాయం కోసం అర్థించినా ఎవ్వరూ రాలేదని.. ఉగ్రవాదులు పారిపోయాక కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టలేదని ఆమె వాపోయారు. పిల్లలను తీసుకొని అక్కడి నుంచి పారిపోండంటూ స్థానికులు గట్టిగా అరవడంతో తాను తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని చెప్పుల్లేని కాళ్లతో మోకాలి లోతులో ఉన్న బురదను దాటుకుంటూ వెళ్లాలని.. ఓ చోట ఆర్మీ జవాను తారసపడి ‘‘ అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు?’’ అని ప్రశ్నించాడని వెల్లడించారు. తాము ప్రభుత్వాన్ని, భద్రతా దళాలపై నమ్మకం పెట్టుకొనే అక్కడికి వెళ్లామని చెప్పారు.