Bhuvanewar: భారత ఓడరేవులో కలకలం.. నౌకలో 21 మంది పాకిస్థానీలు.. అధికారుల హై అలర్ట్..
ABN , Publish Date - May 14 , 2025 | 05:40 PM
Paradip Port Pakistani Crew Members: కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇప్పుడిప్పుడే భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, అంతలోనే ఒడిశా (Odisha) ఓడరేవులో 21 మంది పాకిస్థానీ సిబ్బంది కనిపించడం కలకలం రేపుతోంది. దీంతో పారదీప్ పోర్టు (Paradip port)లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
Security Tightened At Paradip Port: భారత్-పాక్ (India-Pakistan) నడుమ చెలరేగిన ఉద్రిక్తతలు చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దేశంలోని వివిధ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒడిశా (Odisha)లోని పారదీప్ పోర్టు (Paradeep port)లో ఓ నౌకలో పాకిస్థానీ సిబ్బంది ఉండటం కలకలం రేపింది. మొత్తం 25 మంది సిబ్బందితో కూడిన 'ఎమ్‌టీ సైరెన్ II' బుధవారం తెల్లవారుజామున పారదీప్ చేరుకుంది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళుతున్న ఈ నౌకా సిబ్బందిలో 21 మంది పాకిస్థానీలే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
'MT సైరెన్ II' అనే కార్గో షిప్ బుధవారం తెల్లవారుజామున ఒడిశాలోని పారదీప్ ఓడరేవుకు చేరుకుంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళ్తున్న ఈ నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు చేరవేసేందుకు పోర్టుకు వచ్చింది. అయితే, అధికారుల తనిఖీలో ఓడ సిబ్బందిలో 21 మంది పాకిస్థాన్ వాసులు ఉన్నట్టు తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారదీప్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓడలోని మిగిలిన నలుగురూ భారత్, థాయ్‌లాండ్‌కు చెందినవారు.
పారదీప్ పోర్టుకు వచ్చే ఓడలో పాక్ సిబ్బంది ఉన్నారని ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించడం ఒడిశా మెరైన్ పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రతను ముమ్మరం చేసినట్లు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బబితా దేహూరి తెలిపారు. ముడి చమురును ఆఫ్‌లోడ్ చేసేటప్పుడు సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 'MT సైరెన్ II' నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగిల్ పాయింట్ మూరింగ్ (SPM) వద్ద లంగరు వేశారు. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల దృష్ట్యా ఓడరేవును హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.