Bihar Grand Alliance: మహాకూటమిలో సిగపట్లు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:49 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘ఇండీ’ కూటమి పార్టీలతో కూడిన మహాగఠ్‌బంధన్(మహాకూటమి)లో సీట్ల సర్దుబాటుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరికి వారు ఎక్కువ సీట్లలో...
బిహార్లో కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు!.. 2020లో ఓడిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీకి విముఖత
ససేమిరా అంటున్న ఆర్జేడీ
పట్నా, సెప్టెంబరు 16: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘ఇండీ’ కూటమి పార్టీలతో కూడిన మహాగఠ్‌బంధన్(మహాకూటమి)లో సీట్ల సర్దుబాటుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరికి వారు ఎక్కువ సీట్లలో పోటీచేయాలని తహతహలాడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్.. ఈసారి సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాల కోసం కన్నేసింది. గత ఎన్నికల్లో 70 చోట్ల బరిలోకి దిగి.. 19 సీట్లే గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి తక్కువ స్థానాలు తీసుకోవాలని ప్రధాన పార్టీ అయిన ఆర్‌జేడీ సూచిస్తోంది. అయితే ఓడిపోయిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీచేసేందుకు కాంగ్రెస్ కూడా విముఖంగా ఉంది. ఎందుకంటే వాటిలో 21 స్థానాల్లో గత 15 ఏళ్లలో మహాకూటమి పార్టీలేవీ గెలవలేదు. దీంతో ఈ దఫా తక్కువ సీట్లలో పోటీచేసినా.. అవి గెలిచే అవకాశాలు ఉన్నవై ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రతో తమ బలం పెరిగిందని.. దళితులు, ముస్లింలు, ఈబీసీలు, అగ్రవర్ణాల ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న సీట్లు తమకివ్వాలని చర్చల సందర్భంగా పట్టుబడుతోంది. 70 స్థానాలకు తగ్గేది లేదని అంటోంది. ఇందుకు ఆర్‌జేడీ అంగీకరించడం లేదు. బీజేపీతో నేరుగా తలపడిన స్థానాల్లో ఎక్కువ చోట్ల ఆర్‌జేడీ గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఈసారి వీటిలో కొన్నిటిని కాంగ్రె్‌సకు ఇవ్వజూపుతోంది. 150 స్థానాలకు తక్కువగా తాను పోటీచేసేది లేదని అంటోంది. మిగతా 93 సీట్లను మిగతా మిత్రులు పంచుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఆర్‌జేడీ ద్వైపాక్షిక సమావేశాలు జరిపాయి.
మిత్రపక్షాలైన సీపీఐ-ఎంఎల్ లిబరేషన్, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, వీఐపీ, ఆర్‌ఎల్‌ఎల్‌పీలను కూడా సర్దుబాటు చేయాల్సి ఉన్నందున.. వాటికి బలహీన స్థానాల్లో కొన్నిటిని కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయా పార్టీలు ఇందుకు అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. గత ఎన్నికల్లో ఎన్‌డీఏలో ఉన్న వీఐపీ నేత ముకేశ్ సహానీ ఈ సారి మహాకూటమిలోకి వచ్చారు. ఆయన 60 సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. లిబరేషన్ 40 సీట్లు డిమాండ్ చేస్తోంది. మిత్రపక్షాల తీరుతో విసుగుచెందిన ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్.. మొత్తం 243 స్థానాల్లో పోటీచేసే సత్తా తమకుందని ఇటీవల ప్రకటించారు. మరోవైపు, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్.. మహాకూటమి తరఫున బిహార్ సీఎం అభ్యర్థిని తానేనని రాహుల్ సమక్షంలోనే ప్రకటించుకున్నారు. దీనిపై రాహుల్ ఎలాంటి స్పందనా వ్యక్తంచేయలేదు. ఆయన పేరుపై వ్యతిరేకత లేకున్నా.. తమను సంప్రదించకుండా ఆయన స్వీయ ప్రకటన చేయడంపై మిత్రపక్షాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని.. సరైన సమయంలో ప్రకటిస్తామని తేజస్వి చెప్పారు.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి