Share News

Terrorism: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:03 AM

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని.. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగవ్రాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదనీయం కాదన్న భారత వైఖరితో ఏకీభవించాయి.

Terrorism: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు

  • భారత వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ

  • పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన

  • జూన్‌లో ఎస్‌సీవో రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన

  • ప్రకటనలో పహల్గాం అంశం లేకపోవడంపై భారత్‌ నిరసన

  • సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ

  • ఈ నేపథ్యంలో మారిన ఎస్‌సీవో వైఖరి.. డిక్లరేషన్‌

  • ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం: నిపుణులు

  • అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సభ్యదేశాల ఆమోదం

తియాన్జిన్‌, సెప్టెంబరు 1: ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని.. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగవ్రాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదనీయం కాదన్న భారత వైఖరితో ఏకీభవించాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పలు దేశాల నాయకులతో తియాన్జిన్‌లో రెండురోజులుగా జరుగుతున్న ఎస్‌సీవో వార్షిక సదస్సు సోమవారం ముగిసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే తమ దృఢ సంకల్పాన్ని ఎస్‌సీవో సభ్య దేశాలు ఈ సందర్భంగా ఒక ఉమ్మడి ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. అలాంటి గ్రూపులను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావని ఆ డిక్లరేషన్‌లో స్పష్టం చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని.. దేశాల సరిహద్దులు దాటి వెళ్లే ఉగ్రవాదుల కదలికలను నిరోధించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. అలాగే.. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక దాడులను, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సైనిక దాడులను, పాక్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ ఖుజ్దర్‌లో, జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సపై జరిగిన ఉగ్రదాడులను కూడా ఎస్‌సీవో సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌లోని పౌరులను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల వల్ల ఎంతో మంది సామాన్యులు మరణించారని.. ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను, ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డాయి. ఉగ్ర దాడుల వెనుక సూత్రధారులను, వారికి సహకరించినవారిని, దాడులకు పాల్పడినవారిని చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాలని ఎస్‌సీవో సభ్యదేశాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద గ్రూపులనూ ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో కీలకపాత్ర ఐక్యరాజ్యసమితిదే అని తమ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.


భారత్‌ విజయం..

ఎస్‌సీవో డిక్లరేషన్‌లో పహల్గాం ఉగ్రదాడి అంశం ఉండడం భారత్‌ సాధించిన అతిపెద్ద దౌత్య విజయం. ఎందుకంటే.. ఈ ఏడాది జూన్‌ 26న చైనాలోని చింగ్డావ్‌లో ఎస్‌సీవో సభ్యదేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ భేటీలో రూపొందించిన ముసాయిదా సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి ఆయన నిరాకరించారు. బలూచ్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తూ పాక్‌కు అనుకూలంగా రూపొందించిన ఆ ప్రకటనలో.. పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడమే అందుకు కారణం. పహల్గాం దాడిని ఆ ప్రకటనలో చేర్చడానికి ఒక దేశం అభ్యంతరం వ్యక్తం చేసిందని.. చేర్చకపోవడంపై రాజ్‌నాథ్‌ ఆగ్రహం వెలిబుచ్చారని.. దీంతో ఆ ప్రకటన ఆమోదం పొందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ అప్పట్లో తెలిపారు. ఆ పరిణామం జరిగిన రెండు నెలల్లోనే.. పాకిస్థాన్‌, చైనా రెండూ సభ్యదేశాలుగా ఉన్న ఎస్‌సీవో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం.. అంతటితో సరిపెట్టకుండా, సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలపై కన్నేసి ఉంచాలని పాకిస్థాన్‌కు పరోక్షంగా చురకలంటించే వ్యాఖ్యలు అందులో ఉండడం.. అలాంటి ప్రకటనపై పాక్‌తో పాటు, ఆ దేశంతో అంటకాగే చైనా కూడా సంతకం చేయడం.. భారత్‌ సాధించిన అతిపెద్ద దౌత్య విజయంగా విదేశాంగ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.


అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు ఆమోదం

ప్రాంతీయ సామర్థ్యాన్ని, సామాజిక అభివృద్ధిని పెంపొందించడానికిగాను ఒక అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలని ‘షాంఘై సహకార సంస్థ’ సభ్యదేశాలు నిర్ణయించినట్టు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈ వెల్లడించారు. చైనా చేసిన ఈ ప్రతిపాదనపై పదేళ్లపాటు చర్చించిన అనంతరం సభ్యదేశాలు దానికి ఆమోదం తెలిపాయని ఆయన వివరించారు. అయితే.. ఈ బ్యాంకు ఎప్పటిలోగా ఏర్పాటు చేయనున్నారనే విషయమై ఆయన ఎలాంటి వివరాలూ తెలపలేదు. అలాగే.. లావో్‌సను ఎస్‌సీవోలో కొత్త భాగస్వామిగా చేరినట్టు ఆయన వెల్లడించారు. 2001లో షాంఘైలో ఎర్పాటైన ఎస్‌సీవోలో.. భారత్‌, రష్యా, చైనా, కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 02:03 AM