Indrani Mukerjea: ఇంద్రాణి ముఖర్జీ విదేశీ పర్యటన అభ్యర్థనపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:53 PM
విదేశాలకు వెళ్లేందుకు ఇంద్రాణి ముఖర్జీకి అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, రాజేష్ బిందాల్‌లో కుడిన సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఏడాది లోగా కేసు విచారణను పూర్తి చేయాలని విచారణ కోర్టును ఆదేశించింది.

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ షీనా బోరా హత్య కేసు (Sheena Bora Murder Case)లో కీలక నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ (Indrani Mukerjea) చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు తోసిపుచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, రాజేష్ బిందాల్‌లో కుడిన సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఏడాది లోగా కేసు విచారణను పూర్తి చేయాలని విచారణ కోర్టును ఆదేశించింది.
1984 Anti-Sikh Riots: సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
''మీరు విదేశాల నుంచి తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ దశలో మీ అభ్యర్థనను పరిశీలించలేం. విచారణను వేగవంతం చేసి ఏడాదిలోగా పూర్తి చేయాలని విచారణ కోర్టును ఆదేశిస్తు్న్నాం'' అని ధర్మాసనం పేర్కొంది. ఇంద్రాణి ముఖర్జీ ట్రయిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సుప్రీం ధర్మాసనం అనుమతించింది.
దీనికి మందు, ముఖర్జీ విదేశాలకు వెళ్లేందుకు చేసుకున్న అభ్యర్థనను సీబీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఇది సున్నితమైన కేసు అని, విచారణ సగానికి పైగా పూర్తయిందని, 96 మంది సాక్ష్యులను విచారించామని కోర్టుకు తెలిపారు. ముఖర్జీ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు ఇచ్చిందని, అయితే ఈ కేసులో ఇంకా 92 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. నాలుగు నెలలుగా ట్రయిల్ కోర్టు చేసిందేమీ లేనందున విచారణ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంద్రాణి ముఖర్జీ స్పెయిన్, యూకే పర్యటనకు ప్రత్యేక కోర్టు గత జూలై 19న అనుమతి ఇచ్చింది. అయితే, దీనిపై సీబీఐ ముంబై హైకోర్టుకు వెళ్లడంతో ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని ఇంద్రాణి ముఖర్జీ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. 2012లో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ 2015 నుంచి జైలులో ఉంటున్నారు. ఆమెకు 2022లో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.