Saudi Bus Crash: మదీనా రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:05 PM
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. వీరంతా హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన వారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. వీరిలో తొమ్మిది మంది పెద్దలు, తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వీరంతా విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందినవారు. నసీరుద్దీన్.. తన కుటుంబ సభ్యులతో కలిసి 8 రోజుల క్రితం మక్కా యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న బాధిత బంధుమిత్రులు రామ్‌నగర్‌లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాధిత సభ్యులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎలాంటి అవసరమున్నా తక్షణమే తనను సంప్రించాలని వారికి చెప్పారు.
ఇలా ఒకే కుటుంబంలో ఇంత చనిపోవడం నమ్మశక్యంగా లేదంటూ నసీరుద్దీన్ బంధుమిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో.. మృతులకు సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది అక్కడి అధికార యంత్రాంగం.
మదీనాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 46 మంది మృత్యువాతపడ్డారు. వీళ్లంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. మొత్తం నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల గతవారం వీరంతా.. హైదరాబాద్ నుంచి ఉమ్రాకు బయల్దేరారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.