Medina Accident: సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని ఫోన్ చేశారు: మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:30 PM
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 46 మంది మృతిచెందిన విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన పట్ల ప్రధాని మోదీ సహా సంబంధిత ఉన్నతాధికారులతో తాను సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు సౌదీలోని జెడ్డాలో ఉన్న ఇండియన్ హై కమిషన్‌తో మాట్లాడడం జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. వారూ తక్షణ చర్యలు చేపట్టడం సహా అక్కడి ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోందని చెప్పారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని వెల్లడించిన కేంద్రమంత్రి.. మృతుల అంత్యక్రియలను సౌదీలోనే నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి బాధిత కుటుంబసభ్యులను పంపే దిశగా చర్యలు ముమ్మరం చేస్తోందన్నారు. వీరితోపాటు కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన ఒక బృందం అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
మదీనాలో ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన 45 మందితో పాటు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి మృత్యువాతపడ్డారు. బస్సులో ఉన్నవారందరూ దాదాపుగా సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్ వాసులు, ఒకే కుటుంబానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు.