NIA Arrests Jasir Bilal: ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో మరో కీలక వ్యక్తి అరెస్ట్..
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:56 PM
ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదికి ముఖ్య అనుచరుడైన జాసిర్‌ను శ్రీనగర్లో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి మరో కీలక నిందితుణ్ని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడి కేసులో పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదితో కలిసి పనిచేసిన మరో ముఖ్య అనుచరుడు జాసిర్ బిలాల్(Jasir Bilal)ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ.. జాసిర్‌ను జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్(Srinagar)లో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.
జాసిర్.. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్(Ananthnag) జిల్లా కాజిగుండ్‌కు చెందిన వ్యక్తిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇతడు ఉగ్రదాడులు చేపట్టేందుకు గానూ.. ఉగ్రవాదులకు డ్రోన్లు, రాకెట్లు తయారు చేయడంలో సాంకేతికంగా సాయపడినట్టు గుర్తించారు. ఇతడు ఉమర్ నబీతో సన్నిహితంగా పనిచేస్తూ.. ఎర్రకోట దాడి ప్రణాళికను రచించినట్టు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10 జరిగిన పేలుడు ఘటనకు పాల్పడిన ఉమర్‌కు సహకరించిన నిందితుడు అమీర్ రషీద్ అలీ(Umar Nabi Ali)ని కట్టుదిట్టమైన భద్రత నడుమ పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు ముందు సోమవారం ఉదయం హాజరుపరిచారు. ఈ మేరకు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆ వెంటనే రషీద్‌ను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు అధికారులు. అతడిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించలేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు.