Bihar Police Video goes Viral: బైకర్లపై రెచ్చిపోయిన బిహార్ పోలీస్.. వీడియో వైరల్.!
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:50 PM
బిహార్‌లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ దురుసుగా ప్రవర్తించిన తీరును అక్కడున్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో రోడ్లపై రద్దీని నియంత్రించడంలో అక్కడి పోలీస్ వ్యవస్థ దురుసుగా ప్రవర్తించింది. పాట్నాలోని ఓ ఏరియా ట్రాఫిక్ అధికారి కాస్త దురుసుగా ప్రవర్తించారు. వివాదాస్పదంగా ప్రవర్తించిన ఆయన తీరు, మాట్లాడిన విధానాన్ని సమీపంలో ఓ వ్యక్తి తన చరవాణిలో రికార్డ్ చేయబోగా.. మరో పోలీస్ కలుగజేసుకుంటూ అతడిపైనా రెచ్చిపోయారు. అనంతరం దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. వైరల్ అవ్వడంతో పాటు సదరు పోలీస్ ఉద్యోగులపై చర్యలు తీస్కోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
పాట్నాకు చెందిన ఓ యువకుడు మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తూ అక్కడి ఆరు లేన్ల మార్గం వైపునకు వెళ్లాడు. సమీప చెక్‌పాయింట్ వద్ద పోలీస్ సిబ్బంది అతణ్ని ఆపారు. ఆపీ ఆపకముందే ఓ పోలీస్ అధికారి అతడిపై ఫైర్ అయ్యారు. హెల్మెట్ తీయమని హెచ్చరిస్తూ.. ఆ యువకుడిపై దురుసుగా ప్రవర్తించారు. దానికి ఆ బైకర్ మర్యాదగా.. 'చెప్పండి' అని సమాధానమిచ్చాడు. దీంతో మరింత ఆవేశంతో రగిలిపోయి అతడిపై చేయిచేసుకున్నాడా పోలీస్. ఇదంతా గమనిస్తూనే.. సమీపంలో ఉన్న మరో వ్యక్తి దాన్ని రికార్డ్ చేశారు. ఆ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆ కెమెరామెన్ వైపు వెళ్లి, దాన్ని లాగే ప్రయత్నం చేశారు. మరింత ఆవేశానికి లోనై వారిపైనా విరుచుకుపడి దుర్భాషలాడారు.
అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు..
ఈ సంఘటనను అంతా బాధిత యువకుడి స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన మిత్రుడిపై పోలీసులు అకారణంగా చేయిచేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ.. సంబంధిత అధికారిక ఖాతాలను విజిబిలిటీ కోసం ట్యాగ్ చేశాడు. నేడు తన స్నేహితుడిపై జరిగిన ఈ అన్యాయాన్ని పునరావృతం కాకుండా ఉండటం కోసం మరింత మందికి దీనిని షేర్ చేయాలని కోరాడు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలోనే ఆ వీడియోను వెంటనే తీసివేయాలన్నట్టుగా అతడికి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆరోపిస్తూ.. సదరు ఫోన్ తాలుకూ వీడియోనూ అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'జల్దీ డిలీట్ కరో.. నహీతో హమ్ తుమ్‌కో అరెస్ట్ కర్లేంగే(వీడియోను వెంటనే తీసెయ్. లేదంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం)' అని మాట్లాడినట్టుగా అందులో ఉంది. పోలీసులు చట్టవిరుద్ధానికి పాల్పడ్డారు కావున ఎవరు చెప్పినా ఈ వీడియోను తీయనని భీష్మించుకున్న అతడు.. ఈ విషయమై న్యాయం చేయాలని కోరాడు.
దీనికి సంబంధించి అతడి స్నేహితుడు.. పోలీసులు తమపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన అన్ని వీడియోలూ తమవద్ద ఉన్నాయని.. 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు గడువు నిర్దేశించాడు. లేదంటే తాము దాన్ని ఎస్కలేట్ చేయాల్సి వస్తుందని అందులో పేర్కొన్నాడు.
స్పందించిన అధికారులు
ఈ విషయం 'X' ద్వారా తమ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. బిహార్ పోలీసుల పరిస్థితిని ధృవీకరించి అవసరమైన చర్యలు తీస్కోవాలని పాట్నా ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.