US India Relations: మా చమురు కొనకపోతే పోండి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:59 AM
మీకు నచ్చకపోతే మాదగ్గర చమురు తీసుకోకండి’’ అంటూ అమెరికా, యూరప్ చమురు బయ్యర్లకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు.
మేం ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు.. మా రైతులు, వ్యాపారులే మాకు ముఖ్యం
అమెరికా, యూరప్ బయ్యర్లకు తేల్చిచెప్పిన విదేశాంగ మంత్రి జైశంకర్
రష్యా చమురు అంశంపై స్పష్టత
న్యూఢిల్లీ, ఆగస్టు 23 : ‘‘మీకు నచ్చకపోతే మాదగ్గర చమురు తీసుకోకండి’’ అంటూ అమెరికా, యూరప్ చమురు బయ్యర్లకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. రష్యానుంచి చమురు కొంటున్నదన్న కారణంగా భారత ఉత్పత్తులపై ట్రంప్ 50% సుంకం విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలే ముఖ్యమని జైశంకర్ స్పష్టం చేశారు. శనివారమిక్కడ జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ - 2025 సదస్సులో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా చమురు కేంద్రంగా అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న విమర్శలకు ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. ‘‘శుద్ధిచేసిన చమురు లేక పెట్రో ఉత్పత్తులను మా వద్దే తీసుకోవాలని ఎవరినీ మేం బలవంతం పెట్టడం లేదు. అమెరికా యంత్రాంగం వ్యాపారం చేయడాన్ని సమర్థించే కొంతమంది ఇతరులను మాత్రం వ్యాపారం చేయొద్దని అనడం హాస్యాస్పదం. ఇందులో ఒత్తిడి ఏమీ లేదు. నచ్చకపోతే మా ఉత్పత్తులు కొనొద్దు’’ అన్నారు. భారత్ కంటే చైనానే రష్యా చమురును అధికంగా తీసుకుంటున్నా, ఆ దేశంపై ప్రతీకార సుంకాలు వేయరని, ఇంతకుమించి వివక్ష, అన్యాయం ఉంటాయా అని ప్రశ్నించారు. పాకిస్థాన్- అమెరికా సంబంధాలు ఇటీవల పెరగడంపై జైశంకర్ స్పందిస్తూ.. అల్‌కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్‌లో అమెరికా అంతం చేసిన విషయం గుర్తుచేశారు. ‘‘అమెరికా.. పాక్.. లాడెన్’ అంటూ వ్యాఖ్యానించారు. ఆగస్టులో భారత్‌కు రావాల్సిన అమెరికా ప్రభుత్వ బృందం పర్యటన రద్దు కావడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. వాషింగ్టన్, న్యూఢిల్లీల మధ్య వాణిజ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాల రీత్యా కొన్ని పరిమితులు తమకు తాము విధించుకున్నామని, దీని అర్థం కటీఫ్ (తెగదెంపులు) చెప్పినట్టు కాదని జైశంకర్ సరదాగా వ్యాఖ్యానించారు.
అమెరికాకు తపాలా పార్సిళ్లు బంద్
సుంకాల నిబంధనల్లో అమెరికా మార్పులు తెచ్చిన నేపథ్యంలో తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నుంచి అమెరికాకు పంపే పార్సిళ్లను అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది. అయితే, ఉత్తరాలు, పత్రాలు, బహుమతులను మాత్రం ఎప్పటిలాగానే అమెరికాకు పంపవచ్చునని పేర్కొంది. అయితే, వాటి విలువ వంద డాలర్ల లోపు ఉండాలని స్పష్టంచేసింది. 800 అమెరికా డాలర్ల కంటే తక్కువ విలువ ఉండే పార్సిళ్లు, ఇతర కవర్లపై గతంలో అమెరికాలో సుంకం లేదు. కొత్త డ్యూటీ నిబంధనల ప్రకారం.. విలువతో సంబంధం లేకుండా అన్నిరకాల సర్వీసులను సుంకాల పరిధిలోకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News