Rohit Sharma: పాక్‌తో ఉద్రిక్తతలు.. దేశ ప్రజలకు రోహిత్ శర్మ రిక్వెస్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 04:50 PM
దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సాయుధ దళాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఎటువంటి వదంతులను వ్యాప్తి చేయొద్దనిి దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ మిసైల్ దాడులను పూర్తిస్థాయిలో తిప్పి కొడుతున్న భారత సాయుధ దళాలపై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. భారత త్రివిధ దళాలు తనకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో దేశ రక్షణకు వారు కట్టుబడిన తీరు అద్భుతమని ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కూడా కీలక సూచన చేశాడు. తప్పుడు వార్తలను నమ్మి వాస్తవాలుగా ప్రచారం చేయొద్దని అన్నారు. ఈ మేరకు హిట్ మ్యాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిచర్యగా పాక్ జమ్ముకశ్మీర్‌లో పలు ప్రాంతాలను మిసైల్స్‌తో టార్గెట్ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ దాడులను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాయి. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాదుల ఏరివేత అని భారత్ స్పష్టంగా పేర్కొన్నా కూడా పాక్ ఆర్మీ తన కుయుక్తులు కొనసాగిస్తోంది. అయితే, భారత్ మాత్రం దీటుగా జవాబిస్తోంది. కరాచీ, పెషావర్, లాహోర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ కష్ట సమయంలో భారత్ సాయుధ దళాలకు భారతీయ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బుధవారం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఫామ్ లేమితో రోహిత్ సతమతం కావడంతో అతడి భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే ఇంగ్లండ్ టూర్‌లో రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ సంకోచిస్తోందన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు క్రికెట్‌లో దేశం తరపున ఆడటం తనకెంతో గర్వకారణమని అన్నాడు. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ఫార్మాట్‌లో యథాతథంగా కొనసాగుతానని కూడా చెప్పాడు.
Also Read:
ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు
For National News And Telugu News