Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:32 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్‌లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్‌ను నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాధితుడిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సంక్లిష్ట సర్జికల్ ప్రొసీజర్ నిర్వహించిన ఘటన కేరళలో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో వైద్యులు అత్యవసరంగా ఈ ప్రొసీజర్‌ను నిర్వహించారు (Kerala Roadside emergency cricothyrotomy).
కొచ్చి శివారులోని ఉదయంపెరూర్‌లో ఆదివారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. స్కూటర్, మోటర్ సైకిల్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో లీనూ అనే వ్యక్తి స్పృహ కోల్పోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడసాగారు. అదే సమయంలో డా.థామస్ పీటర్, ఆయన భార్య దిదేయా థామస్ తమ వాహనంలో వెళుతూ బాధితులను గమనించారు. మరో కారులో వెళుతున్న డా.బి. మనూప్ కూడా చూశారు. లినూ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వారికి చూడగానే అర్థమైంది. ‘ముఖంలోని ఎముకలు విరిగి శ్వాసనాళానికి అడ్డంగా మారడంతో లీనూకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి చేయి దాటేటట్టు అనిపించింది. దీంతో ముందుగా అతడి శ్వాస నిలిచిపోకుండా చూడాలని భావించాము’ అని డా. మనూప్ తెలిపారు.
ఈ క్రమంలో ముగ్గురు డాక్టర్లు స్థానికుల సాయంతో రోడ్డు పక్కనే లీనూకు ఎమర్జెన్సీ సర్జికల్ క్రైకోథైరోటమీ నిర్వహించారు. శ్వాసనాళంలోకి గాలి వెళ్లేందుకు వీలుగా బ్లేడ్‌తో చిన్న కోత పెట్టి స్ట్రాల సాయంతో తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి తరలించే వరకూ ఆయన ఆరోగ్య స్థితిని స్థిరీకరించారు. అనంతరం, అత్యవసర సిబ్బంది రోడ్డు ప్రమాద బాధితులు ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే, లీనూ దురదృష్టవశాత్తూ మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లీనూకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
భారత్ నుంచి పెరుగుతున్న శాశ్వత వలసలు.. ఏటా 2 లక్షల మందికి పైగా...
ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్స్.. క్షమాపణ చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం