Share News

Prithviraj Chavan: ఆపరేషన్‌ సిందూర్‌తొలి రోజే మనం ఓడిపోయాం

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:27 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ మొదటి రోజే మనం పూర్తిగా ఓడిపోయాం.

Prithviraj Chavan: ఆపరేషన్‌ సిందూర్‌తొలి రోజే మనం ఓడిపోయాం

  • కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలు

  • మన సాయుధ దళాలను అవమానించడం కాంగ్రె్‌సకు అలవాటుగా మారింది: బీజేపీ

  • చౌహాన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

  • క్షమాపణ ఎందుకు చెప్పాలి.. ఆ ప్రసక్తే లేదు: చౌహాన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 17: ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ మొదటి రోజే మనం పూర్తిగా ఓడిపోయాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మే 7న అరగంట పాటు జరిగిన గగనతల యుద్ధంలో భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్‌ కూల్చివేసింది. దాంతో వైమానిక దళం మిగతా అన్ని యుద్ధ విమానాలను కిందకు దించేసింది. తర్వాత ఒక్కటి కూడా ఎగరలేదు. ఒకవేళ గ్వాలియర్‌, బఠిండా, సిర్సా నుంచి యుద్ధ విమానాలను పంపించినా పాకిస్థాన్‌ కూల్చివేసే ప్రమాదం ఉండడంతో వైమానిక దళం వెనక్కి తగ్గింద’ని చౌహాన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పుణెలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వైమానిక, క్షిపణి దాడులు మాత్రమే జరిగాయని, పదాతి దళాలు ఒక్క కిలోమీటరు కూడా కదల్లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో యుద్ధాలు జరుగుతాయని, అలాంటప్పుడు 12 లక్షల మంది సైనికులతో ఆర్మీని నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. వారిని వేరే పనికి వినియోగించుకోవాలని సూచించారు. చౌహాన్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మన సాయుధ దళాలను అవమానించడం, దేశ కోసం చేపట్టే ఆపరేషన్లను చులకన చేయడం కాంగ్రె్‌సకు రివాజుగా మారిందని బీజేపీ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు. ‘చౌహాన్‌ మాత్రమే కాదు.. గతంలో రాహుల్‌ గాంధీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇవి మన సైన్యమంటే కాంగ్రె్‌సకు ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమ’న్నారు. మన సాయుధ దళాల పరాక్రమాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని, చౌహాన్‌ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. చౌహాన్‌ స్పందిస్తూ తాను క్షమాపణ ఎందుకు చెప్పాలని, ఆ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం తనకు ప్రశ్నించే హక్కు ఇచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 02:27 AM