Rajat Kumar: అప్పుడు పంత్ ప్రాణాలు కాపాడాడు.. ఇప్పుడు ప్రేయసితో కలిసి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 07:01 PM
2022లో భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను ప్రాణాలతో కాపాడిన వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే, అతడికి ఏమైంది? ఎందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్: భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను కారు ప్రమాదంలో కాపాడిన రజత్ కుమార్ (25) తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీ అనే గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రాణాలతో పోరాడుతున్న రజత్ కుమార్
రజత్ కుమార్ కుమార్, మను కశ్యప్(21) అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే, కుల విభేదాల కారణంగా వారి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో వారు మనస్థాపం చెంది విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలుస్తోంది. ప్రియురాలు కశ్యప్ చికిత్స పొందుతూ మృతి చెందగా రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రజత కుమార్ తన కుమార్తెను కిడ్నాప్ చేసి విషం ఇచ్చి చంపాడని కశ్యప్ తల్లి ఆరోపిస్తోంది.
రిషబ్ పంత్‌ను కాపాడిన రజత్ కుమార్
డిసెంబర్ 2022లో భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను కారు ప్రమాదం నుండి రక్షించి రజత్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పంత్ ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌కు కారులో వెళుతుండగా, ఆయన మెర్సిడెస్ కారు రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రజత్ కుమార్ కారు ప్రమాదాన్ని గుర్తించి మరో వ్యక్తితో కలిసి సహాయం చేయడానికి పరుగెత్తారు. తమ ప్రాణాలకు తెగించి పంత్‌ను కాలిపోతున్న వాహనం నుండి బయటకు తీసి హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..
పంత్ ప్రాణాలను కాపాడి రజత్, అతడి స్నేహితుడు అందరి ప్రశంసలు పొందారు. తనను కాపాడినందుకు కృతజ్ఞతగా పంత్ వారికి స్కూటర్లను బహుమతిగా ఇచ్చారు. కారు ప్రమాదానికి గురైన పంత్ చాలా త్వరగా కోలుకుని మరుసటి సంవత్సరం క్రికెట్ టీంలోకి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కూమర్ తన ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
Also Read: భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా.. రైలు వస్తున్నా పట్టాలపై పరుగెత్తాడు.. చివరకు..