Aligarh Businessman Murder: యువ వ్యాపారి గుప్తా హత్య కేసులో పూజా శకున్ పాండే అరెస్టు
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:42 PM
అభిషేక్ గుప్తాను కాల్చిచంపిన మహమ్మద్ ఫజల్‌ను పోలీసు అరెస్టు చేయగా.. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) యువ వ్యాపారి అభిషేక్ గుప్తా (Abhisekh Gupta) హత్య కేసులో ప్రధాన నిందితురాలైన అఖిల భారత్ హిందూ మహాసభ (ABHM) ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే (Puja Shakun Pandey)ను పోలీసులు భరత్‌పూర్‌లో శనివారం నాడు అరెస్టు చేశారు. అభిషేక్ గుప్తా (25) సెప్టెంబర్ 26న హథ్రాస్‌కు వెళ్లేందుకు అలీగఢ్‌లోని రోరావర్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి బస్సు ఎక్కుతుండగా ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. గుప్తా అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తీవ్ర సంచలనమైంది.
అభిషేక్ గుప్తాను కాల్చిచంపిన మహమ్మద్ ఫజల్‌ను పోలీసు అరెస్టు చేయగా.. ఈ హత్యకు పూజ, ఆమె భర్త రూ.3లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త అశోక్ పాండే.. అభిషేక్ ఫొటో చూపించారని, రూ.లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. హత్య జరిగిన రోజు రాత్రే పూజా.. ఎబీహెచ్ఎం ప్రతినిధిగా ఉన్న ఆమె భర్త అశోక్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశోక్ పాండేతోపాటు ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ పూజా శకున్ పాండే పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పూజా శకున్ పాండేను సైతం పోలీసులు తాజాగా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
పూజా శకున్ పాండే, ఆమె భర్త అశోక్ పాండేలకు షూటర్లు ఇద్దరూ ఏడెనిమిదేళ్లుగా బాగా తెలుసునని, నెల రోజుల క్రితం వాళ్ల ఇంట్లో వెల్టింగ్ వర్క్ కూడా చేశారని పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడైంది. అభిషేక్ గుప్తాను చంపేందుకు ఆ ఇద్దరు షూటర్లకు రూ.3లక్షలు సుఫారీ ఇచ్చినట్టూ విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఫజల్‌ను అశోక్ పాండే 27 సార్లు, పూజా శకున్ పాండే 11 సార్లు కాంటాక్ట్ చేసినట్టు కాల్ రికార్డుల్లో వెల్లడైంది. పూజా శకున్ పాండే గతంలో మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని బహిరంగంగా ప్రశంసించడంతో ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే
Read Latest Telangana News and National News