RBI: 4.2 ఎకరాలు.. 3,472 కోట్లు
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:29 AM
నూతన కార్యాలయ భవన సముదాయం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.3,472 కోట్లతో ముంబైలో స్థలం కొనుగోలు...
ముంబయిలోని నారిమన్
పాయింట్‌లో ఆర్బీఐ కొనుగోలు
ముంబై మెట్రో సంస్థ నుంచి..
కొత్త భవన సముదాయం కోసం
ముంబై, సెప్టెంబరు 11: నూతన కార్యాలయ భవన సముదాయం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.3,472 కోట్లతో ముంబైలో స్థలం కొనుగోలు చేసింది. నగరానికి గుండెకాయలాంటి నారిమన్ పాయింట్‌లో 4.2 ఎకరాల (16,832 చదరపు మీటర్లు) ప్లాటును ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీఎల్) నుంచి కొనుగోలు చేసింది. ఈ నెల అయిదో తేదీన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నారిమన్ పాయింట్‌లో ఉన్న మార్కెట్ రేటు కన్నా 50ు ఎక్కువ ధర పలికినట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలిపారు. ఇందులో 16 లక్షల చదరపు అడుగుల స్థలంలో భవనాలు నిర్మించనున్నారు. 1.13 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పునరావాసం కోసం కేటాయించారు. నారిమన్ పాయింట్లో లభ్యమయ్యే చిట్టచివరి అతి పెద్ద ప్లాటు ఇదే కావడం గమనార్హం. ఈ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇస్తామంటూ గత ఏడాది అక్టోబరు మూడున మెట్రోరైల్ కార్పొరేషన్ టెండరు పిలిచింది. దీని ద్వారా రూ.5,173 కోట్లు సమకూర్చుకోవాలని ఆశించింది. బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఒబెరాయ్ రియాల్టీ, ఆర్‌ఎంజడ్ గ్రూపు, టాలా గ్రూపులు ఆసక్తి చూపాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా సలహాదారుగా వ్యవహరించింది. అయితే స్థలం కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంకు ముందుకు రావడంతో ఈ ఏడాది జనవరి 18న టెండరు నోటీసును ఉపసంహరించుకొంది. రిజర్వు బ్యాంకు ఇస్తామన్న సొమ్ము కూడా అంచనాలకు అనుగుణంగా ఉండడంతో సమ్మతి తెలిపింది. ఇది రెండు ప్రభుత్వ సంస్థల మధ్య జరిగే లావాదేవీ కావడంతో నిబంధనల పరంగా ఇబ్బందులు ఉండబోవని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
For More TG News And Telugu News