Rahul Gandhi Rally Sparks: రాహుల్ సభపై దుమారం
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:59 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న బిహార్ దర్భంగా ఓటర్ అధికార్ యాత్ర సభ వేదికపై నుంచి ప్రధాని మోదీ తల్లిని కొందరు దూషించడంపై కలకలం రేగుతోంది....
ప్రధాని మోదీ తల్లిపై కొందరు దుర్భాషలాడినట్టు ఆరోపణలు
బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
పట్నాలో రాహుల్ గాంధీపై కేసు
రాహుల్ క్షమాపణ చెప్పాలన్న షా
ఓటర్ అధికార్ యాత్రకు బ్రహ్మరథం అందుకే బీజేపీ కుట్రలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఆగస్టు 29: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న బిహార్ దర్భంగా ఓటర్ అధికార్ యాత్ర సభ వేదికపై నుంచి ప్రధాని మోదీ తల్లిని కొందరు దూషించడంపై కలకలం రేగుతోంది. మోదీ మాతృమూర్తిని హిందీలో దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటన నేపథ్యంలో రాహుల్‌పై బిహార్ బీజేపీ నేత కృష్ణ సింగ్ ఫిర్యాదుతో పట్నాలో కేసు నమోదు చేశారు. బీజేపీ దర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ ఇచ్చిన మరో ఫిర్యాదుతో పోలీసులు దర్భంగాలోని సింఘ్వారా ప్రాంతానికి చెందిన మహ్మద్ రిజ్వీ అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. వేదికపైనుంచి మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో రిజ్వీ కూడా ఉన్నారని బీజేపీ నేతలు కేసు పెట్టారు. మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పాట్నాలో బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసరగా, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండా కర్రలు విసిరారు.
దీంతో సదాఖత్ ఆశ్రమ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మోదీ తల్లిపై దూషణ నేపథ్యంలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని షా వ్యాఖ్యానించారు. మోదీ తల్లి పేదరికంలో నుంచి వచ్చినా విలువలు నేర్పారని, అందువల్లే మోదీ ప్రధాని స్థాయికి చేరుకున్నారని షా చెప్పారు. ఒక పేద తల్లి కుమారుడు 11 ఏళ్లుగా ప్రధాని పీఠంపై ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణం చేసుకోలేకపోతోందన్నారు. మోదీ తల్లిని దూషిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉపయోగించిన భాష అసభ్యకరంగా ఉందని బిహార్ సీఎం నితీశ్ ఖండించారు. కాగా, ఓటర్ అధికార్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని జైరాం రమేశ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..