Rahul Gandhi Protests Denial: సభలో నా నోరు నొక్కేస్తున్నారు!
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:25 AM
విపక్ష నాయకుడిగా లోక్‌సభలో తనకు మాట్లాడే హక్కుందని, కానీ.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా..
విపక్ష నేతగా మాట్లాడే హక్కుంది: రాహుల్
న్యూఢిల్లీ, జూలై 21: విపక్ష నాయకుడిగా లోక్‌సభలో తనకు మాట్లాడే హక్కుందని, కానీ.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నోరు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖానించారు. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల కాలంలో మృతి చెందిన పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు, పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి, అదేవిధంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో దుర్మరణం చెందిన వారికి సభ్యులు నివాళులర్పించారు. అనంతరం.. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే.. ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అనుమతించలేదు. తొలుత ప్రశ్నోత్తరాలు జరగాలని, ఆ తర్వాత ఏ అంశాన్నయినా చర్చించేందుకు అనుమతి ఇస్తామన్నారు. దీంతో విపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో స్పీకర్ బిర్లా సభను వరుసగా రెండుసార్లు వాయిదా వేశారు. దీంతో సభ నుంచి బయటకు వచ్చిన రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రక్షణ మంత్రి సహా బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. కానీ, విపక్షం నుంచి ఏ ఒక్క సభ్యుడికీ ఆయన(స్పీకర్) అవకాశం ఇవ్వట్లేదు. నేను విపక్ష నాయకుడిని. మాట్లాడే హక్కుంది. కానీ, అవకాశమే ఇవ్వట్లేదు. ఇదొక కొత్త సంప్రదాయం’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News