Share News

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:20 AM

బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్‌ బాంబు రాబోతోంది.

Rahul Gandhi: హరియాణాలోనూ ఓట్‌ చోరీ

  • 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది

  • ‘ఆపరేషన్‌ సర్కార్‌ చోరీ’లో మోదీ, అమిత్‌ షాలతో సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు

  • ఓటరు జాబితాలో బ్రెజిల్‌ మోడల్‌ ఫొటోతో 22 ఓట్లు

  • ఒక నియోజకవర్గంలో ఒక్క స్త్రీ ఫొటోతో 100 ఓట్లు

  • హెచ్‌ ఫైల్స్‌ పేరిట.. ‘హైడ్రోజన్‌ బాంబ్‌’ పేల్చిన రాహుల్‌

  • రాహుల్‌వి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసిన బీజేపీ

న్యూఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్‌ బాంబు రాబోతోంది. మీ ఓట్ల చోరీ బండారాన్ని దేశప్రజల ముందు బయటపెడతాం’’.. అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ ఏడాది సెప్టెంబరు 1న బిహార్‌లో ‘ఓటర్‌ అధికార్‌ ర్యాలీ’లో ప్రకటించిన సంగతి గుర్తుందా? ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసిన

ఆ హైడ్రోజన్‌ బాంబును ఆయన.. బిహార్‌లో ఎన్నికలకు ఒక్కరోజు ముందు.. బుధవారం ఇక్కడ ‘ద హెచ్‌ ఫైల్స్‌’ పేరిట నిర్వహించిన మీడియా సమావేశంలో పేల్చారు. గత ఏడాది జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచిందని.. ఆ ఎన్నికను చోరీ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. హరియాణాలో కాంగ్రె్‌సకు దక్కాల్సిన ఘనవిజయాన్ని ఓటమిగా మార్చడం కోసం చేపట్టిన ‘ఆపరేషన్‌ సర్కార్‌ చోరీ’కి.. ఈసీ కూడా సహకరించిందని.. ప్రధాని మోదీ, అమిత్‌షాలతో, బీజేపీతో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హరియాణా ఓటరు జాబితాలో 25,41,144 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని.. 5,21,619 డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని.. 93,174 మంది ఓటర్ల చిరునామాలు తప్పుగా ఉన్నాయని.. 1,24,177 నకిలీ ఫొటోలు ఓటర్‌ ఐడీల్లో ఉన్నాయని పేర్కొన్నారు.


ఓకే మహిళ.. పేర్లు వేరే..

రాహుల్‌ తన ఆరోపణలకు ఆధారంగా.. రాయ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో ఒకే మహిళ ఫొటోతో ఉన్న 22 ఎంట్రీలను చూపించారు. ‘‘ఇది బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ ఫొటో. ఏదో వెబ్‌సైట్‌ నుంచి ఈ ఫొటోను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసి ఉంటారు. ఓటరు జాబితాలో ఈ ఫొటో స్వీటీ, సీమ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా వేర్వేరు పేర్లతో 22సార్లు కనిపించింది’’ అని రాహుల్‌ మండిపడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 పోలింగ్‌ బూత్‌ల్లో ఆ మహిళ ఓటు వేసిందని, ఆమె ఓట్లు వేసిన స్థానాల్లో తమ పార్టీ ఓడిపోయిందన్నారు. అలాగే.. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే మహిళ ఫొటోతో 100 ఓటర్‌ కార్డులు ఉన్న విషయాన్నీ రాహుల్‌ ప్రజల దృష్టికి తెచ్చారు. ‘‘ఈ మహిళ.. కావాలంటే హరియాణాలో 100సార్లు ఓటు వేయొచ్చు. బీజేపీవాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చి ఓటు వేసే అవకాశం కల్పించడానికే ఇలా చేశారు. మరో మహిళ ఫొటో రెండు పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఏకంగా 223సార్లు కనిపించిందని రాహుల్‌ పేర్కొన్నారు. హోడల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌కు చెందిన ఇంట్లో 66మంది ఓటర్లున్నారని, అదే నియోజకవర్గంలో ఒక ఇంట్లో 501 మందికి ఓటు హక్కు ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనేక మందికి హరియాణాలోనూ ఓటు హక్కు ఉందని తెలిపారు. ఇళ్లులేని వాళ్లకు ఇంటి నంబరుగా జీరోను కేటాయిస్తామని దేశ ప్రజలకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ అబద్ధాలు చెబుతున్నారని, ఆ ఇళ్ల పేరుతో ఏం జరుగుతోందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందన్నారు. ‘‘డూప్లికేట్‌ ఓట్లను ఎన్నికల కమిషన్‌ ఒక్క సెకనులో తీసేయగలదు. కానీ వాళ్లు అలా ఎందుకు చేయట్లేదు? కారణం.. వారు బీజేపీకి సహాయం చేస్తున్నారు’’అని రాహుల్‌ అన్నారు. ఎన్నికలకు ముందు 3.5 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపిం చారు. కాగా హరియాణా ఎన్నికల్లో తమ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ రాహుల్‌ చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఎలాంటి ఆధారాలూ లేని తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది. రాహుల్‌ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దేశ ప్రజాస్వామ్యాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి ఎన్నికల కమిషన్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని కేంద్రమంత్రి కిరెన్‌ రిజిజు మండిపడ్డారు.

ఇంతకీ ఎవరా మోడల్‌?

మీడియా సమావేశంలో రాహుల్‌ ప్రస్తావించిన బ్రెజిలియన్‌ మోడల్‌ ఎవరా అని చాలా మంది ఆరా తీశారు. రాహుల్‌ చూపిన ఫొటోలో ‘మాథ్యూస్‌ ఫెర్రెరో’ అనే పేరు ఉండడంతో.. ఆ పేరుతో గూగుల్‌లో శోధించగా ఆయన ఒక ఫొటోగ్రాఫర్‌ అని తేలింది. ఆయన పోర్ట్‌ఫోలియోలో ఈ మోడల్‌ ఫొటో కూడా ఉందిగానీ.. ఆమె పేరు మాత్రం లేదు.


‘‘హరియాణాలో ఓటర్ల సంఖ్య 2 కోట్లు. 25 లక్షల నకిలీ ఓట్లంటే.. ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ ఓటరు. మొత్తం ఓటర్ల సంఖ్యలో 12.5 శాతం’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే.. ‘‘ఏదో తేడా జరిగింది’’ అని చాలా మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు తనతో అన్నారని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినప్పటికీ.. చివరికి బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. బీజేపీ ఆ ఎన్నికల్లో ఓట్లచోరీకి పాల్పడిందనడానికి నిదర్శనంగా.. ‘‘ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బీజేపీ గెలవబోతోంది’’ అంటూ బీజేపీ నేత, హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ చేసిన వ్యాఖ్యల వీడియోను రాహుల్‌ ప్రదర్శించారు. ‘‘అందరూ కాంగ్రెస్‌ గెలుస్తుందంటున్న సమయం అది. కానీ ఈ పెద్ద మనిషి (నాయబ్‌సింగ్‌ సైనీ) మాత్రం గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. బీజేపీ ఏర్పాట్లు చేసిందని నవ్వుతూ చెప్పారు’’ అని మండిపడ్డారు. పోస్టల్‌ ఓటింగ్‌ ఫలితాలు అసలు ఫలితాలకు భిన్నం గా ఉండడం హరియాణా చరిత్రలోనే తొలిసారి అని పేర్కొన్నారు. 100శాతం రుజువులతో తాను ఈ ఆరోపణలు చేస్తున్నానని.. కాంగ్రెస్‌ దక్కాల్సిన ఘన విజయాన్ని నష్టంగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని దుయ్యబట్టారు. 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయిందని.. ఒకచోట 32ఓట్ల తేడాతో పరాజయంపాలైందని.. కేవలం 22,779 ఓట్ల తేడాతో మొత్తంగా హరియాణా ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 05:56 AM