Share News

Radha Krishna Sworn: 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:35 AM

భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ..

Radha Krishna Sworn: 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో కార్యక్రమం

  • మోదీ, ఖర్గే, కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య, అన్సారీ, ధన్‌ఖడ్‌ హాజరు

  • ఏపీ సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూడా..

  • హాజరు కాని రాహుల్‌ గాంధీ, ఇతర విపక్షాల నేతలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీప్రమాణం చేయించారు. రాధాకృష్ణన్‌ తమిళ సంప్రదాయ దుస్తులు, ఎర్ర కుర్తా ధరించి వచ్చిన ఆయన.. భగవంతుడిపై ఆంగ్లంలో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, చంద్రబాబు సహా ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, హమీద్‌ అన్సారీ, పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సైతం సతీసమేతంగా హాజరవడమే గాక.. అందరినీ నవ్వుతూ పలకరించడం గమనార్హం. వెంకయ్య పక్కనే ఆసీనులయ్యారు. జూలై 21న రాజీనామా చేశాక ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే ప్రథమం. అనారోగ్య కారణాలతో ఆయన రాజీనామా చేయడం వల్లే ఈ నెల 9న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగడం, రాధాకృష్ణన్‌ ‘ఇండీ’ కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల ఆఽధిక్యంతో విజయం సాధించడం తెలిసిందే. ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రాధాకృష్ణన్‌ ఇక రాజ్యసభ చైర్మన్‌గానూ వ్యవహరించనున్నారు. 2030 సెప్టెంబరు 11 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ మాత్రమే కనిపించారు. ఖర్గేతో రాధాకృష్ణన్‌ కరచాలనం చేశారు. మిగతా ప్రతిపక్షాల నేతలెవరూ రాలేదు. 2022లో ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారానికి కూడా విపక్ష నేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. కాగా.. ప్రమా ణస్వీకారం అనంతరం రాధాకృష్ణన్‌ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. సదైవ్‌ అటల్‌ (స్మారక చిహ్నం) వద్ద మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికి, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ స్మారక చిహ్నం వద్ద, కిసాన్‌ ఘాట్‌ వద్ద మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాజ్యసభ చైర్మన్‌ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, ఎల్‌.మురుగన్‌ స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణాస్థల్‌ వద్ద దేశ ప్రసిద్ధ నేతలు, స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్తల విగ్రహాలకు ఆయన నివాళులు అర్పించారు.


మోదీ అభినందనలు

కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తన పదవీకాలాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రజాజీవితం, ప్రజాస్వామ్య విలువలకు ఆయన జీవితాంతం కట్టుబడుతూ వచ్చారని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. దేశ నిర్మాణం, సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.

సీపీ జీవన విశేషాలు..

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎ్‌స)తో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ (68) తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 మే 4న జన్మించారు. తూత్తుకుడిలోని వీవో చిదంబరం కాలేజీలో బీబీఏ చదివారు. 16ఏళ్ల వయసు నుంచే ఆర్‌ఎ్‌సఎస్‌, జన్‌సం్‌ఘతో అనుబంధం పెంచుకున్నారు. కోయంబత్తూరు నుంచి 1998, 99ల్లో రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిఽధ్యం వహించారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. నాటి ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఏకాభిప్రాయ సాధకుడిగా పేరు సంపాదించారు. తమిళనాడు రాజకీయాల్లో ‘మిస్టర్‌ క్లీన్‌’ కూడా. 2003 నుంచి 2006 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషిచేశారు. 2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తర్వాత తెలంగాణ.. నిన్నటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గానూ పనిచేశారు.

మలేసియా వెళ్లడానికి రాహుల్‌కు టైముందా?

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారానికి లోక్‌సభ లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ గైర్హాజరుపై బీజేపీ మండి పడింది. మలేసియా వెళ్లడానికి ఆయనకు టైముంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ ఎద్దేవాచేశారు.


ఇవి కూడా చదవండి..

కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటో‌ను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 07:47 AM