Share News

Puri Stampede: స్పందించిన సీఎం.. కీలక నిర్ణయం

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:47 PM

పూరీలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ స్పందించారు. ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేశారు.

Puri Stampede: స్పందించిన సీఎం.. కీలక నిర్ణయం

భువనేశ్వర్, జూన్ 29: జగన్నాథుడి రథ యాత్ర సందర్భంగా పూరీలోని ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి, పలువురు గాయపడడంపై ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ప్రజలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ క్షమాపణలు చెప్పారు. ఈ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షమించరాని ఘటన చోటు చేసుకుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ.. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్, జిల్లా ఎస్పీ వినీత్ అగర్వాల్‌లపై బదిలీ వేటు వేశారు. వారి స్థానంలో జిల్లా కలెక్టర్‌గా చంచల్ రాణా, ఎస్పీగా పినాక్ మిశ్రాను నియమించారు.


మరోవైపు.. ఈ తొక్కిసలాట ఘటన కారణంగా బీజేపీ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను చాటు తుందందని మండిపడ్డారు. రథయాత్ర నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలిపారు. రథయాత్ర నిర్వహణను సక్రమంగా నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికిి చేత కాలేదని చెప్పారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు.


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొనాలంటూ ఒడిశా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.


పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున జగన్నాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు మరణించారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్

మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. ఆ తర్వాత ఏమైందంటే..

For More National News And Telugu News

Updated Date - Jun 29 , 2025 | 03:51 PM